నెటిజన్లూ.. బ్రౌజర్‌లలో జాగ్రత్త 

నెటిజన్లూ.. బ్రౌజర్‌లలో జాగ్రత్త 

మీరు వాడుతున్న వెబ్‌ బ్రౌజర్‌లో ఆటోఫిల్‌ ఆప్షన్‌ ఆన్‌లో ఉందా? అయితే వెంటనే దాన్ని ఆపేయండి. లేదంటే మీ వ్యక్తిగత వివరాలు.. ఆన్‌లైన్‌ లావాదేవీల సమాచారమంతా సైబర్‌ నేరగాళ్ల చేతుల్లోకి వెళ్లే ప్రమాదం ఉందట. కొన్ని వెబ్‌సైట్లలో రహస్య టెక్ట్స్‌ బాక్సుల ద్వారా ఆటోఫిల్‌ వివరాలను హ్యాకర్లు చోరీ చేస్తున్నట్లు సెక్యూరిటీ నిపుణుల గుర్తించారు.

ఆటోఫిల్‌ ఆప్షన్‌ ఆన్‌లో ఉంటే ఏదైనా వెబ్‌సైట్‌లో రిజిస్టర్‌ అయినప్పుడు.. లావాదేవీలు నిర్వహించినప్పుడు మన వివరాలన్నీ బ్రౌజర్‌లోనూ స్టోర్‌ అవుతాయి. మళ్లీ ఎప్పుడైనా మన వివరాలు అవసరమున్నప్పుడు పేరు లేదా ఈ-మెయిల్‌ ఐడీని టైప్‌ చేయగానే గతంలో ఇచ్చిన మిగతా వివరాలన్నీ వచ్చేస్తాయి. చాలామందికి అది ఉపయోగకరంగానే అనిపిస్తుంది. ప్రతిసారీ టైప్‌ చేయాలన్న బాధ తప్పుతుంది అనుకుంటారు. కానీ.. ఆ సమాచారాన్ని గుట్టుచప్పుడు కాకుండా సైబర్‌ నేరగాళ్లు లాగేసే వీలుందని ఫిన్‌లాండ్‌కు చెందిన ఎథికల్‌ హ్యాకర్‌ విజ్లమి కోస్మనెన్‌ గుర్తించారు.

కొన్ని వెబ్‌సైట్లలో రహస్య టెక్ట్స్‌ బాక్సులను ఉంచి.. వ్యక్తిగత వివరాలతోపాటు.. క్రెడిట్‌.. డెబిట్‌ కార్డుల సమాచారాన్నీ సైబర్‌ నేరగాళ్లు సులువుగా చోరీ చేసేస్తారట. గూగుల్‌ క్రోమ్‌.. మొజిల్లా ఫైర్‌ ఫాక్స్‌.. యాపిల్‌ సఫారీ.. ఒపేరా వంటి ప్రముఖ బ్రౌజర్లతోనూ ఈ సమస్య ఉన్నట్లు గుర్తించారు. అందుకే ఆటోఫిల్‌ ఆప్షన్‌ను డిజేబుల్‌ చేసుకోవాలని నిపుణులు సూచిస్తున్నారు.