వీడియో కాలింగ్‌ డివైస్‌లను లాంచ్‌ చేసిన ఫేస్‌బుక్‌

వీడియో కాలింగ్‌ డివైస్‌లను లాంచ్‌ చేసిన ఫేస్‌బుక్‌

  ప్రముఖ సోషల్‌ నెట్‌వర్కింగ్‌ సైట్‌ ఫేస్‌బుక్‌ పోర్టల్‌, పోర్టల్‌ ప్లస్‌ పేరిట రెండు నూతన వీడియో కాలింగ్‌ డివైస్‌లను ఇవాళ విడుదల చేసింది. గృహ వినియోగం కోసం వీటిని ప్రత్యేకంగా డిజైన్‌ చేశారు. వీటిల్లో ఆర్టిఫిషియల్‌ ఇంటెలిజెన్స్‌ (ఏఐ) టెక్నాలజీ ఉంది. అందువల్ల వీడియో కాలింగ్‌ చేసుకోవడం మరింత సౌకర్యవంతంగా ఉంటుంది. పోర్టల్‌ డివైస్‌లో 10 ఇంచుల హెచ్‌డీ డిస్‌ప్లే (1280 * 800 పిక్సల్స్‌ స్క్రీన్‌ రిజల్యూషన్‌) ఉండగా, పోర్టల్‌ ప్లస్‌లో 15 ఇంచుల ఫుల్‌ హెచ్‌డీ డిస్‌ప్లే (1920 * 1080 పిక్సల్స్‌ స్క్రీన్‌ రిజల్యూషన్‌)ను ఏర్పాటు చేశారు. వీటిల్లో స్మార్ట్‌ కెమెరా, స్మార్ట్‌ సౌండ్‌ టెక్నాలజీని అందిస్తున్నారు. అందువల్ల యూజర్లు హ్యాండ్స్‌ ఫ్రీ కాల్స్‌ చేసుకోవచ్చు.

ఫేస్‌బుక్‌ పోర్టల్‌ డివైస్‌లలో ఉన్న స్మార్ట్‌ సౌండ్‌ టెక్నాలజీ వల్ల యూజర్లు అవతలి వ్యక్తులతో కాల్స్‌ మాట్లాడేటప్పుడు వారి బ్యాక్‌గ్రౌండ్‌లో ఉండే శబ్దాలు పూర్తిగా తగ్గుతాయి. దీని వల్ల అవతలి వారి వాయిస్‌ స్పష్టంగా వినిపిస్తుంది. అలాగే అవతలి వ్యక్తులకు పోర్టల్‌ డివైస్‌ లేకపోయినప్పటికీ మెసెంజర్‌ ద్వారా కాల్స్‌ చేసుకోవచ్చు. ఒకేసారి 7 మందితో గ్రూప్‌ కాల్స్‌ చేసుకుని మాట్లాడవచ్చు. పోర్టల్‌ డివైస్‌లలో అమెజాన అలెక్సా డిజిటల్‌ అసిస్టెంట్‌ను ఏర్పాటు చేశారు. అందువల్ల యూజర్లు వాయిస్‌ కమాండ్లతో డివైస్‌ ద్వారా క్రీడావార్తలు, వాతావరణ విశేషాలు తదితర సమాచారాన్ని తెలుసుకోవచ్చు. ఈ డివైస్‌లలో ప్రైవసీకి కూడా పెద్ద పీట వేశారు. యూజర్లు తమకు అవసరం లేదనుకుంటే కెమెరా, మైక్రోఫోన్‌లను డిజేబుల్‌ చేసుకోవచ్చు.

ఫేస్‌బుక్‌ పోర్టల్‌ డివైస్‌లకు లాక్ పెట్టుకునే సదుపాయం కల్పించారు. 12 డిజిట్ల పాస్‌కోడ్‌ను వీటికి సెట్‌ చేసుకుంటే డివైస్‌లు సురక్షితంగా ఉంటాయి. ఇక ఈ రెండు డివైస్‌లను నవంబర్‌ నుంచి విక్రయించనున్నారు. అమెజాన్‌, ఫేస్‌బుక్‌, బెస్ట్‌ బై సైట్లలో ఈ డివైస్‌లు లభిస్తాయి. పోర్టల్‌ డివైస్‌ ధర రూ.14,717 ఉండగా, పోర్టల్‌ ప్లస్‌ ధర రూ.25,810 గా ఉంది. ఇక రెండింటినీ ఒకేసారి కలిపి కొనుగోలు చేస్తే రూ.22,045 మాత్రమే అవుతుంది.