వాయిస్‌ ఆదేశాలతో టీవీ!!

వాయిస్‌ ఆదేశాలతో టీవీ!!

  హైదరాబాద్, బిజినెస్‌ బ్యూరో: టీవీ పనిచేయాలంటే రిమోట్‌ వాడాలి. అసలు రిమోట్‌ను ఆపరేట్‌ చేసే అవసరం లేకుండా మాటలతోనే పనిచేస్తే..! ఎలక్ట్రానిక్స్‌ తయారీ దిగ్గజం ఎల్‌జీ భారత్‌లో ఆర్టిఫీషియల్‌ ఇంటెలిజెన్స్‌ (ఏఐ) టెక్నాలజీ ఆధారంగా వాయిస్‌ కమాండ్‌తో పనిచేసే థింక్యూ టీవీలను ప్రవేశపెట్టింది.చానెల్, పాటలు, వీడియోలు, గేమ్స్, ఫొటోలు.. ఇలా ఏది కావాలన్నా వాయిస్‌తో ఆదేశిస్తే చాలు. టీవీ పనిచేస్తుంది. ఇంట్లో ఇంటర్నెట్‌ ఉండాల్సిన అవసరం లేకపోవడం మరో విశేషం. 32–77 అంగుళాల సైజులో మొత్తం 25 మోడళ్లను మంగళవారమిక్కడ ప్రవేశపెట్టింది. వీటి ధరలు రూ.30 వేలతో ప్రారంభమై రూ.30 లక్షల వరకు ఉన్నాయి.

యూహెచ్‌డీ 40 శాతం..
దేశవ్యాప్తంగా 2017లో ఒక కోటి ఫ్లాట్‌ ప్యానెల్‌ టీవీలు అమ్ముడయ్యాయి. ఈ ఏడాది ఈ సంఖ్య 1.3 కోట్లకు చేరుకుంటుందని పరిశ్రమ అంచనా వేస్తోంది. పరిశ్రమలో తమ కంపెనీకి 25 శాతం వాటా ఉందని ఎల్‌జీ ఎలక్ట్రానిక్స్‌ ఇండియా హోమ్‌ ఎంటర్‌టైన్‌మెంట్‌ డైరెక్టర్‌ యూంచుల్‌ పార్క్‌ ఈ సందర్భంగా తెలిపారు. గతేడాది పండుగల సీజన్లో జరిగిన కంపెనీ అమ్మకాల్లో అల్ట్రా హెచ్‌డీ టీవీల వాటా 14 శాతం. ఈ సీజన్లో ఇది 40 శాతానికి చేరుకుంటుందని ధీమాగా చెప్పారు. కస్టమర్లు తమ చిన్న టీవీల స్థానంలో పెద్ద స్క్రీన్లతో రీప్లేస్‌ చేస్తుండడం అధికంగా జరుగుతోందని వెల్లడించారు.