విండోస్ 7, 8 ఓఎస్‌లకు టెక్నికల్ సపోర్ట్ నిలిపివేత..!

విండోస్ 7, 8 ఓఎస్‌లకు టెక్నికల్ సపోర్ట్ నిలిపివేత..!

  సాఫ్ట్‌వేర్ దిగ్గజ సంస్థ మైక్రోసాఫ్ట్ విండోస్ 10 ఆపరేటింగ్ సిస్టమ్‌ను విడుదల చేసినప్పటి నుంచి పాత తరం సాఫ్ట్‌వేర్ ఉత్పత్తులకు నెమ్మదిగా టెక్నికల్ సపోర్ట్‌ను నిలిపివేస్తూ వస్తున్నది. అందులో భాగంగానే ఇకపై విండోస్ 7, 8, 8.1 ఆర్‌టీ, ఆఫీస్ 2010, 2013 ఉత్పత్తులకు టెక్నికల్ సపోర్ట్‌ను నిలిపివేస్తున్నట్లు మైక్రోసాఫ్ట్ ప్రతినిధులు ఒక ప్రకటనలో తెలిపారు. జూలై నుంచి ఈ ప్రొడక్ట్‌లకు గాను వినియోగదారులకు ఎలాంటి సపోర్ట్ లభించదని, కాకపోతే వీటికి చెందిన కమ్యూనిటీ ఫోరమ్స్ యథాతథంగా పనిచేస్తాయని వారు తెలిపారు.

కానీ వాటిల్లో మైక్రోసాఫ్ట్ ప్రతినిధులు వినియోగదారుల ప్రశ్నలకు సమాధానాలివ్వరని, కేవలం ఫోరమ్స్‌ను నిర్వహించేందుకే వారు వాటిల్లో యాక్టివ్‌గా ఉంటారని మైక్రోసాఫ్ట్ తెలిపింది. కాకపోతే ఆ ఫోరమ్స్‌లో వినియోగదారులు ఒకరికొకరు తమకు కలిగే సమస్యలకు పరిష్కారాలను కనుగొని అందరూ వాటిని ఒకరితో మరొకరు షేర్ చేసుకోవచ్చని మైక్రోసాఫ్ట్ తెలిపింది. అలాగే ఇంటర్నెట్ ఎక్స్‌ప్లోరర్ 10, సర్ఫేస్ ప్రొ, సర్ఫేస్ ప్రొ 2, సర్ఫేస్ ఆర్‌టీ, సర్ఫేస్ 2, మైక్రోసాఫ్ట్ బ్యాండ్, ఇతర మొబైల్ డివైస్‌లకు కూడా జూలై నుంచి టెక్నికల్ సపోర్ట్‌ను నిలిపివేస్తున్నామని ఆ సంస్థ వెల్లడించింది.