2 కోట్ల విలువైన సినిమా సెట్టింగ్ దగ్ధం

2 కోట్ల విలువైన సినిమా సెట్టింగ్ దగ్ధం

హైదరాబాద్: నగరం లో జూబ్లీహిల్స్‌లోని అన్నపూర్ణ స్టూడియోలో సోమవారం సాయంత్రం భారీ అగ్నిప్రమాదం జరిగింది. షార్ట్‌సర్యూట్ వల్ల మంటలు చెలరేగడం తో సుమారు రూ.2 కోట్ల విలువైన సెట్టింగ్ కాలిపోయింది. ఐదేండ్ల క్రితం మనం సినిమా కోసం వేసిన సెట్లో మంటలు చెలరేగాయి. ఫైబర్, కలప తదితర సామగ్రితో సెట్టింగ్ వేయడంతో మంటలువేగంగా వ్యాపించాయి. ఐదు ఫైరింజన్లతో రెండున్నర గంటలపాటు శ్రమించి ఫైర్‌సిబ్బంది మంటలను అదుపుచేశారు. మీడియా ప్రతినిధులను సెక్యూరిటీ సిబ్బంది లోపలికి అనుమతించలేదు.

స్టూడియోలోని సిబ్బంది భయాందోళనతో బయటకు పరుగులు తీశారు. నటుడు అక్కినేని నాగేశ్వర్‌రావు చివరిగా నటించిన మనం సినిమా ఇంటి సెట్టింగ్‌లో రారండోయ్ వేడుకచేద్దాం, రాజుగారి గది-2 తదితర సినిమాలను చిత్రీకరించారు. ఈ సెట్లో ప్రస్తుతం షూటింగ్‌లు లేకపోవడంతో ప్రాణనష్టం జరుగలేదు.

నటుడు, తన తండ్రి అక్కినేని నాగేశ్వర్‌రావు జ్ఞాపకార్థం ఉంచిన మనం సినిమా ఇంటి సెట్టింగ్ అగ్నికి ఆహుతి కావడం బాధాకరమని నటుడు నాగార్జున తెలిపారు. చివరిరోజులు తన తండ్రి ఇక్కడే గడిపారని, తమ కుటుంబసభ్యులకు ఈ ఇంటి సెట్టింగ్‌తో ప్రత్యేకమైన అనుబంధం ఉందని పేర్కొన్నారు.