>

‘అందుబాటులో విత్తనాలు, ఎరువులు’

‘అందుబాటులో విత్తనాలు, ఎరువులు’

  రైతులకు సరిపడ విత్తనాలు, ఎరువులు అందుబాటులో ఉంచుతున్నామని వ్యవసాయ శాఖ మంత్రి పోచారం శ్రీనివాస్‌రెడ్డి తెలిపారు. జిల్లాలోని రుద్రూర్ మండలంలో సుడిగాలి పర్యటన చేసిన మంత్రి పోచారం పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేశారు. రూ. 1.35 కోట్లతో రుద్రూర్ మండలం రాణంపల్లి - లింగంపల్లి మధ్య నిర్మించనున్న హైలెవల్ వంతెన, చెక్‌డ్యాంకు, మండల కేంద్రంలో రూ. 3.14 కోట్లతో నిర్మించనున్న 50 డబుల్ బెడ్‌రూం ఇండ్ల నిర్మాణానికి శంకుస్థాపన చేశారు. నూతనంగా నిర్మించిన కస్తుర్బా గాంధీ పాఠశాల, గ్రామపంచాయతీ భవనం, వంజర, కటిక, బోయ, కమ్యూనిటీ భవనాలను ప్రారంభించారు.

అనంతరం అక్కడ ఏర్పాటు చేసిన సభలో మంత్రి ప్రసంగించారు. 2018 ఖరీఫ్ నాటికి కాళేశ్వరం ప్రాజెక్టు ద్వారా గోదావరి జలాలను నిజాం సాగర్‌లోకి తీసుకువచ్చి ప్రతి ఏడాది రెండు పంటలకు నీరందిస్తామని ప్రకటించారు. రైతులకు మేలైన మద్దతు ధర కోసం గ్రామ రైతు సంఘాలను ఏర్పాటు చేస్తున్నామని తెలిపారు. క్రాఫ్ కాలనీలను ఏర్పాటు చేస్తామన్నారు. గ్రామాల్లో కులవృత్తుల ప్రోత్సాహంలో భాగంగా గొల్లకురుమలకు గొర్రె పిల్లలను పంపిణీ చేయబోతున్నామని పేర్కొన్నారు.


Loading...