బంద్ ఎఫెక్ట్.. స్తంభించిన జనజీవనం

బంద్ ఎఫెక్ట్.. స్తంభించిన జనజీవనం

 హైదరాబాద్ : కేంద్రం ప్రతిపాదించిన మోటారు వాహనాల సవరణ బిల్లు, 2017కు వ్యతిరేకంగా దేశవ్యాప్తంగా ప్రజా రవాణా సంస్థలు ఇవాళ బంద్ పాటిస్తున్న విషయం విదితమే. ఈ క్రమంలో తెలంగాణ వ్యాప్తంగా జనజీవనం స్తంభించిపోయింది. హైదరాబాద్ నగరంలో 3500 బస్సులు నిలిచిపోయాయి. బస్సులతో పాటు ఆటోలు, పలు క్యాబ్ యాజమాన్యాలు కూడా బంద్‌లో పాల్గొన్నాయి. ఉదయం నుంచి ఆర్టీసీ బస్సులు, ఆటోలు, పలు క్యాబ్‌లు రోడ్లపైకి రాకపోవడంతో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. 


కాలేజీ విద్యార్థులు, ప్రభుత్వ, ప్రయివేటు ఉద్యోగులు తమ కళాశాలలు, కార్యాలయాలకు వెళ్లేందుకు గంటల పాటు బస్టాపుల్లో వేచి ఉన్నారు. ప్రయివేటు వాహనాలు, కొంతమంది ఆటో డ్రైవర్లు.. ప్రయాణికుల నుంచి భారీగా డబ్బులు డిమాండ్ చేసి వారిని వారి గమ్యస్థానాలకు చేర్చారు. తప్పని పరిస్థితుల్లో సాధారణ ఛార్జీ కంటే రెట్టింపు ఛార్జీలు చెల్లించాల్సి వచ్చిందని ప్రయాణికులు వాపోయారు. ఇక కాచిగూడ, సికింద్రాబాద్, నాంపల్లి రైల్వే స్టేషన్లు ప్రయాణికులతో కిక్కిరిసిపోయాయి. ఆర్టీసీ బస్సులు నడవకపోవడంతో.. ప్రత్యామ్నాయంగా ఎంఎంటీఎస్ రైల్లో ఉద్యోగులు, విద్యార్థులు తమ కార్యాలయాలు, కాలేజీలకు వెళ్లారు. కొందరైతే కాలినడకనే తమ కార్యాలయాలకు చేరుకున్నారు. బంద్ నేపథ్యంలో ఉదయం వేళలో హైదరాబాద్ మెట్రో ప్రతి 6 నిమిషాలకు ఒక మెట్రో రైలును నడిపింది.