బయ్యారంపై వచ్చే నెలలో ప్రకటన

బయ్యారంపై వచ్చే నెలలో ప్రకటన

హైదరాబాద్: ఢిల్లీలో కేంద్ర ఉక్కుశాఖ మంత్రి బీరేంద్రసింగ్‌తో సమావేశమైన మంత్రి కేటీఆర్, బయ్యారంలో ఉక్కుకర్మాగారం ఏర్పాటుకు అవసరమైన ముడి ఇనుము (ఐరన్‌ఓర్) పుష్కలంగా ఉన్నందున ఫ్యాక్టరీ ఏర్పాటుపై తగిన నిర్ణయం తీసుకోవాలని విజ్ఞప్తిచేశారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ ఏపీ పునర్విభజన చట్టంలో పొందుపరిచినట్టు బయ్యారంలో స్టీల్‌ప్లాంట్‌ను ఏర్పాటు చేయాలంటూ ప్రధానమంత్రి నరేంద్రమోదీని ముఖ్యమంత్రి కేసీఆర్ గతంలోనే కోరారని గుర్తుచేశారు.

ఈ నేపథ్యంలోనే కేంద్ర ఉక్కుశాఖ ఒక టాస్క్‌ఫోర్స్‌ను ఏర్పాటుచేసిందని పేర్కొన్నారు. టాస్క్‌ఫోర్స్ ఏర్పాటు తరువాత కేంద్ర మంత్రి బీరేంద్రసింగ్ ఫోన్‌చేసి తెలంగాణ అభిప్రాయాలను వినిపించాలని కోరారు. అందులో భాగంగానే ఈరోజు ఉన్నతాధికారులతో కలిసి టాస్క్‌ఫోర్స్‌కు రాష్ట్ర అభిప్రాయాలను వెల్లడించామని తెలిపారు. దీంతో బయ్యారం ఉక్కు కర్మాగారంపై త్వరలోనే శుభవార్త రానుంది. స్టీల్ ఫ్యాక్టరీ నిర్మాణానికి సరిపడా ముడి ఇనుము ఉన్నందున వచ్చే నెలలో కేంద్ర ప్రభుత్వం ఒక సానుకూల ప్రకటన ఇచ్చే అవకాశం ఉందని రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖల మంత్రి కే తారకరామారావు తెలిపారు.

బయ్యారంలో ఉక్కు కర్మాగారం ఏర్పాటు సాధ్యమేనా? అన్న సందేహాలు తొలిగిపోయాయని చెప్పారు.ప్రాథమికంగా 70 మిలియన్ టన్నుల ఐరన్‌ఓర్ బయ్యారంలో ఉంది. నేషనల్ మినరల్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్ ద్వారా ఛత్తీస్‌గఢ్‌లోని బైలాడిల్లాలో ఉన్న 170 మిలియన్ టన్నులను కలిపి బయ్యారంలో ఉక్కు ఫ్యాక్టరీని ఏర్పాటు చేయాలని కోరాం. అప్పుడు ఇంటిగ్రేటెడ్ స్టీల్‌ప్లాంట్ ఏర్పాటవుతుందని, ఈ విషయంలో రాష్ట్ర ప్రభుత్వం ఆసక్తిగా ఉన్నదని చెప్పాం.

 

రెండుమూడు చిన్న సమస్యలున్నాయి. వీటిపై నెలరోజుల్లో పరిష్కారం చూపించాలని కేంద్రమంత్రి అధికారులకు సూచించారు. బయ్యారంలో స్టీల్‌ప్లాంట్ ఫ్యాక్టరీ ఆచరణ సాధ్యమేనా అన్న విషయంపై సుదీర్ఘంగా చర్చించగా అన్ని సందేహాలు నివృత్తిచేశాం. డిసెంబర్ 8న ఎన్‌ఎండీసీ వార్షిక సమావేశంలో పాల్గొనడానికి మంత్రి బీరేంద్రసింగ్ హైదరాబాద్ వస్తున్నారు. అప్పుడు మరేదైనా సమాచారం కావాలంటే ఇస్తాం. ఫ్యాక్టరీ ఏర్పాటుకు ఎన్‌ఎండీసీ, సెయిల్ ద్వారా పెట్టుబడి పెట్టాలని కూడా కోరాం. దీనిపై కేంద్రమంత్రి సానుకూలంగా స్పందించారు. మెకాన్, ఉన్నతాధికారులతో కలిసి తుది నివేదికను మీరే తయారుచేయండని ఆయన సూచించారు. ఎన్‌ఎండీసీ వార్షికోత్సవంలో బయ్యా రం ప్లాంట్ ఏర్పాటును కేంద్ర మంత్రి ప్రకటిస్తారని ఆశిస్తున్నాం అని మంత్రి కేటీఆర్ వివరించారు.