>

చేనేత చొరవకు  కేంద్రమంత్రి  ప్రశంస

చేనేత చొరవకు  కేంద్రమంత్రి  ప్రశంస

న్యూఢిల్లీ :చేనేత రంగానికి చేయూతనివ్వడానికి రాష్ట్ర ప్రభుత్వం ఇటీవల తీసుకున్న నిర్ణయాలను కేంద్ర జౌళి శాఖ మంత్రి స్మృతి ఇరానీ ప్రశంసించారు. ప్రభుత్వ ఉద్యోగులంతా వారంలో ఒక రోజు చేనేత దుస్తులనే ధరించాలని రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం అభినందనీయమన్నారు. తాను కూడా వ్యక్తిగతంగా ఇదే విధానాన్ని కొనసాగిస్తున్నట్టు ఆమె గుర్తుచేశారు. ఢిల్లీ పర్యటనలో ఉన్న రాష్ట్ర మంత్రి కేటీఆర్ బుధవారం స్మృతిఇరానీతో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా... చేనేతను ప్రోత్సహించటానికి రాష్ట్రప్రభుత్వం తీసుకుంటున్న చర్యలను తెలియజేశారు. మరోవైపు, జౌళిరంగం అభివృద్ధికి తెలంగాణ ప్రభుత్వం చేస్తున్న ప్రయత్నాలను వివరించిన కేటీఆర్ మార్చి నెలలో హైదరాబాద్‌లో అంతర్జాతీయస్థాయిలో నిర్వహించబోయే జౌళి పెట్టుబడిదారుల శిఖరాగ్ర సదస్సుకు రావాల్సిందిగా స్మృతిఇరానీని ఆహ్వానించారు. అందుకామె వస్తానంటూ హామీ ఇచ్చారు. ఈ వివరాల్ని కేటీఆర్ మీడియా సమావేశంలో వెల్లడించారు. జౌళి సదస్సు సందర్భంగా ప్రముఖ ఫ్యాషన్ డిజైనర్లను ఆహ్వానించి ఫ్యాషన్ షోలు నిర్వహించి చేనేతకు ప్రచారం కల్పించాలంటూ స్మృతి ఇరానీ సూచించారని తెలిపారు.

వరంగల్‌లో నెలకొల్పబోయే మెగా టెక్స్‌టైల్ పార్కుకు సంబంధించి కేంద్రం నుంచి ఆర్థిక మద్దతు కావాలని కోరామని, వ్యర్థాల శుద్ధీకరణ ప్లాంట్ ఏర్పాటుకు కేంద్రం నుంచి ఆర్థిక సాయం చేయనున్నట్లు గతంలో హామీ ఇచ్చారని, ఆ విషయాన్ని కూడా కేంద్రమంత్రితో చర్చించామని కేటీఆర్ తెలియజేశారు. సిరిసిల్లలో మెగా పవర్‌లూమ్ క్లస్టర్‌ను ఏర్పాటు చేయాల్సిందిగా కోరడంతోపాటు కేంద్రం నుంచి ఆర్థికంగానూ, ఇతర రకాలుగానూ సహకారం కావాలని కోరామని, అందుకు మంత్రి సానుకూలంగా స్పందించారని తెలిపారు. సిరిసిల్ల పట్టణంలో సుమారు నలభై వేల వరకు పవర్‌లూమ్స్ ఉన్నాయని, లక్షలాది మంది కార్మికులు ఈ పరిశ్రమపై ఆధారపడుతున్నందువల్ల మెగా పవర్‌లూమ్ క్లస్టర్ ఏర్పాటు చాలా అవసరమని, రానున్న బడ్జెట్‌లో దీనికి ఆర్థిక కేటాయింపులు చేసేలా చొరవ తీసుకోవాలని కోరామన్నారు. త్వరలోనే ఆర్థిక మంత్రిత్వశాఖకు ఈ విషయాన్ని నివేదిస్తానని, తప్పకుండా ఆర్థిక కేటాయింపులు జరిగేలా చూస్తానని స్మృతిఇరానీ హామీ ఇచ్చారని కేటీఆర్ వెల్లడించారు.


Loading...