ఎన్నికలకు బ్రాండ్ అంబాసిడర్లు

ఎన్నికలకు బ్రాండ్ అంబాసిడర్లు

  హైదరాబాద్ : ప్రజాస్వామ్య వ్యవస్థలో ఓటుహక్కు ప్రాధాన్యం, దాని విలువ, వినియోగ విధానం గురించి ప్రజలకు అవగాహన కల్పించేందుకు తెలంగాణలో బ్రాండ్ అంబాసిడర్లను నియమించినట్టు రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి (సీఈవో) రజత్‌కుమార్ చెప్పారు. వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో వయోజనులంతా విధిగా ఓటువేసేలా ప్రచారం చేసేందుకు రాష్ట్రస్థాయి బ్రాండ్ అంబాసిడర్లుగా టెన్నిస్ క్వీన్ సానియామీర్జా, బ్యాడ్మింటన్ కోచ్ పుల్లెల గోపీచంద్, మాజీ క్రికెట్ వీవీఎస్ లక్ష్మణ్, ప్రముఖ ప్రజాకవి, గాయకుడు గోరటి వెంకన్నను నియమించామన్నారు. మహబూబ్‌గనర్ జిల్లాకు ప్రముఖ సినీనటుడు విజయ్ దేవరకొండ బ్రాండ్ అంబాసిడర్‌గా వ్యవహరిస్తారని తెలిపారు. 

దివ్యాంగ ఓటర్ల కోసం ప్రత్యేకంగా ఆరుగురిని (సినీనటి అభినయశ్రీ, అంతర్జాతీయ బాడ్మింటన్ క్రీడాకారుడు ఆంజనేయ, క్రికెట్ క్రీడాకారుడు మహేంద్ర, జాతీయస్థాయి గాయని శ్రావ్య, టీవీ యాంకర్ సుజాత, సైంటిస్టు బాబూనాయక్) బ్రాం డ్ అంబాసిడర్లను నియమించామన్నారు. ఓటువేసే విధానంపై దివ్యాంగులకు అవగాహన కల్పించేందుకు ఎన్నికల కమిషన్ (ఈసీ) మంగళవారం వర్క్‌పాప్ నిర్వహించింది. దీనికి హాజరైన రజత్‌కుమార్ మీడియాతో మాట్లాడుతూ. రాష్ట్రంలో 18 ఏండ్ల వయసు నిండిన దివ్యాంగులు సుమారు 7 లక్షల మంది ఉన్నారని, వీరిలో 4,12,098 మంది ఓటర్లుగా నమోదయ్యారని, మిగిలినవారిని కూడా ఓటర్ల జాబితాలో చేర్చేందుకు అధికారులు చర్యలు చేపడుతున్నారని చెప్పారు. వీరంతా వీల్‌చైర్లలో పోలింగ్ కేంద్రాల్లోకి వెళ్లేలా ర్యాంపులు ఏర్పాటుచేస్తున్నామన్నారు.