‘మాది రైతు ప్రభుత్వం’

‘మాది రైతు ప్రభుత్వం’

  హైదరాబాద్ : ప్రజలకు ఇచ్చిన వాగ్దానాలను వందకు వందశాతం.. గతంలో నెరవేర్చినట్టుగానే ఇప్పుడు కూడా నెరవేరుస్తామని ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌రావు ప్రకటించారు. తెలంగాణ ప్రభుత్వం ముమ్మాటికీ రైతుపక్షపాతిగా వ్యవహరిస్తుందని చెప్పారు. గతంలో మాదిరిగానే రుణమాఫీ అమలుపరుస్తామని, రైతుల అభివృదే ్ధ టీఆర్‌ఎస్ ప్రభుత్వ ధ్యేయమని స్పష్టం చేశారు. భూరికార్డులను వందశాతం ప్రక్షాళిస్తామని, నీటిపారుదలకు ప్రథమ ప్రాధాన్యమిస్తామని చెప్పారు. చీకట్లో ఇష్టానుసారంగా బాణం వేయమని.. అన్నీ ఆలోచించే చేస్తామన్నారు.

ఐదేండ్లకాలంలో హామీలన్నీ పూర్తిచేస్తామని చెప్పారు. ఇండ్ల పథకంలో అక్రమాలు లేకుండా పకడ్బందీ విధానాన్ని అనుసరిస్తున్నామని, కేంద్రప్రభుత్వ ఆయుష్మాన్ భారత్ కన్నా మన ఆరోగ్యశ్రీ పథకమే అద్భుతమని పేర్కొన్నారు. శాసనసభలో గవర్నర్ ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే తీర్మానంపై ఆదివారం చర్చ సందర్భంగా ముఖ్యమంత్రి మాట్లాడుతూ.. సభ్యులు అడిగిన పలు ప్రశ్నలకు వివరణ ఇచ్చారు. ధన్యవాదాలు తెలిపే తీర్మానాన్ని ఎమ్మెల్యే కొప్పుల ఈశ్వర్ ప్రతిపాదించగా, ఎమ్మెల్యే వేముల ప్రశాంత్‌రెడ్డి బలపరిచారు. అనంతరం తీర్మానంపై చర్చలో వివిధ పార్టీల సభ్యులు పాల్గొన్నారు. 

చర్చలో పాల్గొన్న అందరికీ ధన్యవాదాలు తెలిపారు. టీఆర్‌ఎస్ ప్రభుత్వం ఆచరించిన, అనుసరించిన, అవలంబించిన అన్ని విధానాలను ప్రజలు గత నాలుగున్నర సంవత్సరాలు పరిశీలించారని, అనంతరమే తిరిగి అఖండ మెజార్టీ ఇచ్చి ఈ ప్రభుత్వాన్ని మళ్లీ గెలిపించారని పేర్కొన్నారు. ఇంతటి విశ్వాసాన్ని తమ మీద ఉంచినందుకు శిరస్సు వంచి నమస్కరిస్తూ హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేస్తున్నానన్నారు. గవర్నర్ ప్రసంగం పబ్లిక్ మీటింగ్‌లో కేసీఆర్ ప్రసంగంలాగా ఉందని విపక్షాలు చేసిన విమర్శలపై సీఎం కేసీఆర్ మండిపడ్డారు. గవర్నర్ ప్రసంగాన్ని విమర్శించినవారి రాజకీయ పరిజ్ఞానానికి జాలిపడటం తప్ప చేయగలిగింది ఏమీలేదన్నారు. ఏ పార్టీ ప్రభుత్వాన్ని గెలిపించారో, ఆ పార్టీ మ్యానిఫెస్టో.. అదే పాలసీ గవర్నర్ ప్రసంగంలో ఉంటదని కేసీఆర్ స్పష్టం చేశారు. గవర్నర్ మంచి సమయం ఇచ్చి, మంచి ప్రసంగం చేశారని, ఆయనకు ధన్యవాదాలు తెలుపడం మనందరి ధర్మమని చెప్పారు. గవర్నర్ ప్రసంగానికి ధన్యవాద తీర్మానాన్ని ఏకగీవ్రంగా ఆమోదించాలని కోరారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి ప్రభుత్వ ప్రాథమ్యాలను, వివిధ కార్యక్రమాల అమలుతీరును సోదాహరణంగా వివరించారు.