మద్యం ప్రియులకు శుభవార్త

మద్యం ప్రియులకు శుభవార్త

హైదరాబాద్: తెలంగాణ ప్రభుత్వం మందుబాబులకి కిక్కు పెంచే నిర్ణయం తీసుకుంది. తెలంగాణ సర్కారు 2017-2019 నూతన మద్యం పాలసీని ప్రకటించింది. నేడు దానికి సంబంధించిన నొటిఫికేషన్ విడుదల కానుంది. సెప్టెంబర్ 19 సాయంత్రం ఐదు వరకు దరఖాస్తులు స్వీకరిస్తారు. ఆ తరువాత సెప్టెంబర్ 22న కొత్త వైన్ షాపులకు డ్రా తీయనున్నారు. ఆ మరుసటి రెండు రోజులకు వాటికి లైసెన్స్ ఇవ్వనున్నారు. దీనికోసం జీవో నెం 200, 201 విడుదల అయింది. డ్రా నిర్వహణ బాధ్యతలను జిల్లా కలెక్టర్లకు అప్పగించారు.

నూతన మద్యం పాలసీని సిద్ధం చేసిన ప్రభుత్వం నేటి నుంచి కొత్తగా టెండర్లు స్వీకరిస్తోంది. మందు కోసం వైన్‌షాపుకు వెళ్లాల్సిన పని లేకుండా మాల్స్‌లో కూడా మందు అమ్ముకునేందుకు అవకాశమిచ్చింది. ఇక జీహెచ్ఎంసీ పరిధిలో మద్యం షాపులకు మరో గంట గడువు పెంచుతూ... రాత్రి 11 వరకు బార్లు తెర్చుకునే అవకాశం కల్పించింది.

ఇక 3 లక్షలకు పైగా జనాభా ఉన్న ప్రాంతాల్లోని మద్యం దుకాణాలకు గతంలో 81.6 లక్షల శ్లాబు ఉండేది. తాజాగా పర్మిట్‌ రూమ్‌తో కలిపి ఈ శ్లాబును 85 లక్షలకు పెంచారు. గ్రేటర్‌ హైదరాబాద్‌ పరిధిలో గతంలో 1.08 కోట్లు ఉండగా, ఈసారి దానిని పర్మిట్‌ రూమ్‌తో కలిపి 1.10 కోట్లుగా నిర్ధారించారు. రెండేళ్ల లీజు కాలాన్ని ఎప్పటిలాగే కొనసాగించనున్నారు. ఇక ప్రతి వైన్ షాపు దగ్గర సీసీ కెమెరాలను ఏర్పాటు చేయాలని సర్కారు నిర్ణయించింది. అలా ప్రతి చోటా ఏర్పాటు చేసిన సీసీ కెమెరాను కంట్రోల్ రూమ్ కు అనుసంధానం చేయనున్నట్టు  ప్రిన్సిపల్ సెక్రటరీ సోమేష్ కుమార్ తెలిపారు. అలాగే గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో ఎప్పటిలానే రాత్రి పదకొండు గంటల వరకు మద్యం అమ్మకాలకు సమయమిచ్చారు.  మద్యం వ్యాపారులు టెండర్ల టైంలోనే సిండికేట్ అయ్యే ఛాన్స్ లేదని ప్రభుత్వ అధికారులు చెబుతున్నారు. అలాగే కల్తీ మద్యంపై ఉక్కుపాదం మోపుతామంటోంది సర్కారు. 

తెలంగాణలో ఎట్టకేలకు మద్యం పాలసీ ఖరారైంది.. రాష్ట్రంలో గతంలో ఉన్న ఆరు శ్లాబులను నాలుగు శ్లాబులకు కుదించాలని నిర్ణయం తీసుకున్న ఎక్సైజ్ శాఖ.. గతంలో 50 వేల రూపాయలుగా ఉన్న దరఖాస్తు రుసుమును లక్ష రూపాయలకు చేర్చింది.పాత పాలసీలో ఆరు శ్లాబులను నాలుగు శ్లాబులకు కుదించాలని ఎక్సైజ్ శాఖ నిర్ణయించింది.. మేజర్‌ గ్రామ పంచాయతీ, మండల కేంద్రంలో గతంలో 39.5 లక్షలు, 40.8 లక్షలుగా ఉన్న రెండు శ్లాబులను కలిపేసి 45 లక్షలతో ఒక శ్లాబు చేశారు. గతంలో 2 లక్షల నుంచి 3 లక్షలలోపు జనాభా ఉన్న ప్రాంతాల్లోని మద్యం షాపులకు 50 లక్షలు, 60 లక్షల శ్లాబులు ఉండగా, ఆ రెండింటిని కలిపి 55 లక్షలతో ఒకే శ్లాబు చేశారు.

రాష్ట్రవ్యాప్తంగా 2216 వైన్ షాపులకు టెండర్ రానున్నాయి. షాపుల వేలం ద్వారా 1360 కోట్లు ఆదాయం వస్తుందని సర్కారు అంచనా వేస్తోంది. దరఖాస్తు ఫీజు రూపంలో గత ఏడాది 150 కోట్లు రాగా ఈ సారి అది 250 కోట్లు వస్తుందని అంచనా.