మేడిపల్లిలో  ట్యాంకర్లు పేలి భారీ అగ్ని ప్రమాదం

మేడిపల్లిలో  ట్యాంకర్లు పేలి భారీ అగ్ని ప్రమాదం

 మేడిపల్లి: మేడ్చల్‌ జిల్లా మేడిపల్లి శివారు ప్రాంతం చెంగిచెర్ల శుక్రవారం మధ్యాహ్నం వణికింది. నిర్మానుష్యంగా ఉన్న ప్రాంతంలో భారీ అగ్ని ప్రమాదం సంభవించింది. ఆయిల్‌ ట్యాంకర్‌లో చెలరేగిన మంటలు సెకన్ల వ్యవధిలో అంతా వ్యాపించాయి. ఏం జరిగిందో తెలుసుకునే లోపే దట్టమైన పొగ ఆ ప్రాంతాన్ని కప్పేసింది. ఉవ్వెత్తున్న ఎగిసిన మంటలు స్థానికులను భయాందోళనకు గురిచేశాయి. ఈ ఘటనలో షెడ్డులో పనిచేస్తున్న వారితోపాటు రోడ్డుపై వెళ్తున్న 15 మందికి తీవ్ర గాయాలయ్యాయి. ముగ్గురి పరిస్థితి విషమంగా ఉంది. ఘటనా ప్రాంతంలో పార్కు చేసిన సుమారు ఏడు ద్విచక్రవాహనాలు దగ్ధమయ్యాయి.

పోలీసులు, స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. మేడ్చల్‌ జిల్లా మేడిపల్లి మండలం చెంగిచెర్ల శివారు ప్రాంతంలోని ఎస్వీ గార్డెన్‌ ఎదురుగా ఉన్న ఖాళీ ప్రదేశంలో ఓ మెకానిక్‌ షెడ్డు ఉంది. ఈ షెడ్డు నుంచి వచ్చిన నిప్పు రవ్వలు పక్కనే ఉన్న ఆయిల్‌ ట్యాంకర్‌కు తాకడం.. ఈ ప్రమాదానికి కారణమైనట్టు తెలుస్తోంది. నిప్పురవ్వలు ఇటు ఆయిల్‌ ట్యాంకర్‌కు, పక్కనే ఉన్న గ్యాస్‌ సిలిండర్లకూ మంటలు అంటాయి. దీంతో ఒక్కసారిగా పేలుడు సంభవించింది. పేలుడు ధాటికి ఆయిల్‌ ట్యాంకర్‌ సుమారు 30 అడుగుల ఎత్తుకు ఎగిరిపడినట్టు స్థానికులు తెలిపారు. ఈ క్రమంలో కొన్ని అగ్ని కిలలు రోడ్డుపై వెళ్తున్న వెంకట్‌ నాయక్‌ (25) అనే వ్యకిపై పడటంతో తీవ్ర గాయాలపాలయ్యాడు. మరోవైపు షెడ్డు ఆవరణలో పార్కు చేసి ఉన్న ఏడు ద్విచక్ర వాహనాలు కాలిపోయాయి. కేవలం 20 నిమిషాల వ్యవధిలోనే అంతా జరిగింది. సమాచారం అందుకున్న ఫైర్‌ సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకుని మంటలను ఆదుపు చేశారు. అగ్ని ప్రమాదంలో గాయపడ్డ ఆరుగురిని గాంధీ ఆస్పత్రికి తరలించారు. అందులో ముగ్గురి పరిస్థితి విషమంగా ఉంది.