మెట్రో రెండోదశ ప్రతిపాదిత మార్గాలు..

మెట్రో రెండోదశ ప్రతిపాదిత మార్గాలు..

 హైదరాబాద్ : మెట్రోరైలు రెండో దశ డిటైల్డ్ రిపోర్ట్(డీపీఆర్) సిద్ధమైంది. ఎయిర్ ఎక్స్ వే పేరుతో ప్రారంభించనున్న ఈ ప్రాజెక్టుకు సంబంధించిన నివేదికను ఢిల్లీ మెట్రో రైలు సంస్థ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వానికి అందచేసింది. ఐతే దీన్ని పూర్తిస్థాయిలో ప్రభుత్వం పరిశీలించి మార్పులు, చేర్పులు చేశాక మెట్రోరైలు రెండో దశ మార్గాలపై పూర్తిస్థాయి స్పష్టత వచ్చే అవకాశమున్నది. రెండోదశ కోసం ప్రతిపాదించిన మార్గాలతో పాటు మరిన్ని మార్గాలు కూడా పెరిగే అవకాశముందని చెబుతున్నారు. ఈ విషయాన్ని పట్టణాభివృద్ధిశాఖకు చెందిన కీలక అధికారి వెల్లడించారు. మొదటి దశ మెట్రోరైలు దాదాపు పూర్తికావస్తున్న నేపథ్యంలో రెండో దశ మెట్రోరైలు ప్రాజెక్టును ప్రభుత్వం ప్రారంభించబోతున్నది. అందులో భాగంగా ఢిల్లీ మెట్రోరైలు కార్పొరేషన్ సమగ్ర నివేదికను తయారు చేసే బాధ్యతలను అప్పగించింది.


రెండో దశ మెట్రోరైలు ప్రాజెక్టును చేపట్టాలని గత సంవత్సరం జనవరి నెలలో నిర్ణయించారు. అందులోభాగంగా నగరం నలుమూలల నుంచి ఎయిర్‌పోర్టు కనెక్టివిటీ పెంచడంతో పాటు నగరంలోని ఒక ప్రాంతం నుంచి మరో ప్రాంతానికి వెళ్లడానికి శంషాబాద్ ఎయిర్‌పోర్టు నుంచి రాయదుర్గం వరకు 31 కిలోమీటర్లమేర రెందో దశ నిర్మాణం చేయాలని నిర్ణయించారు. అంతేకాకుండా బీహెచ్‌ఈఎల్ నుంచి లక్డీకపూల్ వరకు 26.2 కిలోమీటర్లు, నాగోల్ నుంచి ఎల్బీనగర్ వరకు 5.1 కిలోమీటర్లు కూడా చేపట్టనున్నారు. కొత్తగా ఉప్పల్ నుంచి మల్లాపూర్ మీదుగా ఈసీఐఎల్ మార్గాన్ని చేపట్టే ప్రతిపాదన కూడా ఉన్నది. 

రాయదుర్గం , గచ్చిబౌలి, టీఎస్ పోలీస్ అకాడమీ మీదుగా శంషాబాద్ ఎయిర్‌పోర్ట్ వరకు, అదేవిధంగా మియాపూర్ బీహెచ్‌ఈఎల్, మదీనగూడ, హఫీజ్‌పేట్, కొండాపూర్, ఖాజాగూడ జంక్షన్, షేక్‌పేట్, రేతీబౌలీ, మెహిదీపట్నం మీదుగా లక్డీకపూల్‌కు కలుపనున్నారు. రెండో దశ మెట్రో కోసం ఇప్పటికే శంషాబాద్ ఎయిర్‌పోర్ట్ పరిసరాల్లో 60 ఎకరాల భూమిని కూడా గుర్తించినట్లు తెలిసింది. మొదటి దశ పూర్తిగా పీపీపీ మోడల్‌లో నిర్మిస్తే రెండోదశ ప్రాజెక్టును తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వమే నిర్మించడానికి నిర్ణయించింది.