మైనర్ బాలికపై దారుణం

మైనర్ బాలికపై దారుణం

 చార్మినార్: హైదరాబాద్ నగరంలోని కామాటిపురా పోలీస్‌స్టేషన్ పరిధిలో దారుణం చోటుచేసుకొన్నది. 16 ఏండ్ల మైనర్ బాలికపై పదకొండు మంది సామూహిక లైంగికదాడికి పాల్పడ్డారు. నాలుగేండ్లుగా బెదిరిస్తూ దారుణాన్ని కొనసాగిస్తుండటంతో బాధితురాలు విషయాన్ని తల్లిదండ్రులకు చెప్పి గతనెల 24న పోలీసులకు ఫిర్యాదుచేసింది. దాంతో పోలీసులు ముగ్గురిని అరెస్టు చేశారు. పోలీసులు, బాధితురాలి కుటుంబీకులు తెలిపిన వివరాల ప్రకారం.. మురళీధర్‌నగర్‌లో నివసించే ఓ మైనర్ బాలికపై.. అదే కాలనీకి చెందిన విజయ్ కన్నేశాడు. చాలారోజులుగా పరిచయమున్న విజయ్ కూల్‌డ్రింక్ ఇవ్వడంతో తాగింది. కూల్‌డ్రింక్‌లో మత్తుమందు కలుపడంతో బాలిక నిద్రలోకి జారుకోగానే లైంగికదాడికి పాల్పడ్డాడు.


లైంగికదాడి దృశ్యాలను సెల్‌ఫోన్‌లో చిత్రీకరించి విజయ్ తన స్నేహితులకు పంపాడు. వీటిని చూపి భయపెట్టిన యువకుడు రాజేశ్ కూడా బాలికపై లైంగికదాడి జరిపాడు. అనంతరం మరో ఇద్దరు కూడా ఇదే తరహా బెదిరింపులకు పాల్పడి లైంగికదాడికి దిగారు. ఫొటోలను సోషల్ మీడియాలో పెడతామంటూ బెదిరిస్తూ పదకొండు మంది నాలుగేండ్లుగా లైంగికదాడికి పాల్పడుతున్నారు. చివరకు లైంగికదాడి విషయాన్ని తల్లిదండ్రులకు చెప్పి కామాటిపురా పోలీసులకు ఫిర్యాదుచేసింది. దాంతో శుభం, రాజేశ్, అభిజిత్‌ను అరెస్టుచేసి రిమాండ్ తరలించారు. లైంగికదాడికి మూలకారకుడైన విజయ్‌ను పంచ్ పేరుతో పోలీసులు రక్షిస్తున్నారంటూ బాధితురాలి కుటుంబీకులు ఆదివారం కామాటిపురా పోలీస్‌స్టేషన్ ఎదుట ఆందోళనకు దిగారు. వేగంగా దర్యాప్తు జరిపి దోషులను శిక్షించేందుకు కేసు విచారణకు సీసీఎస్ మహిళా పోలీస్‌స్టేషన్ ఏసీపీ శ్రీదేవిని దర్యాప్తు అధికారిగా నియమిస్తున్నట్టు పోలీస్ కమిషనర్ అంజనీకుమార్ వెల్లడించారు.