మైనర్ భార్యతో లైంగిక సంబంధం నేరం

మైనర్ భార్యతో లైంగిక సంబంధం నేరం

ఢిల్లీ: మైనర్లతో వివాహంపై సుప్రీంకోర్టు సంచలన తీర్పును ఇచ్చింది. మైనర్ భార్యతో లైంగిక సంబంధం ఉన్నట్లయితే అది అత్యాచారం కిందికి వస్తుందని స్పష్టం చేసింది. ఒక వ్యక్తి 18 ఏళ్ల లోపు భార్యతో శారీరక సంబంధం కలిగి ఉంటే అది నేరమవుతుందని కోర్టు పేర్కొంది. మైనర్ గా ఉన్న భార్య భర్తకు వ్యతిరేకంగా ఏడాది లోపు కోర్టుకు ఫిర్యాదు చేయవచ్చని కోర్టు తెలిపింది.

 15 నుంచి 18 ఏళ్ల లోపు వయసున్న భార్యతో శారీరక సంబంధాన్ని నేరంగా పరిగణిస్తూ సుప్రీంకోర్టు తీర్పునిచ్చింది. ఇలాంటి కేసుల్లో 15 నుంచి 18ఏళ్ల లోపు వివాహిత బాలికలను మినహాయించడం రాజ్యంగబద్ధం కాదని స్పష్టం చేసింది. దీనిపై ఓ స్వచ్ఛంద సంస్థ దాఖలు చేసిన పిటిషన్ ను విచారణకు స్వీకరించిన కోర్టు ఈ తీర్పునిచ్చింది. వివాహితులైన మైనర్లతో లైంగిక చర్య ఎంతమాత్రం సరైనదని కాదని పిటిషన్‌లో పేర్కొంది.

బాల్యవివాహమే చట్టవ్యతిరేకం అయినప్పుడు 15ఏళ్ల నుంచి 18ఏళ్ల బాలికలపై కాపురం పేరుతో లైంగికచర్యకు పాల్పడటం చట్టమెలా అవుతుందని ప్రశ్నించింది. బాల్య వివాహాలపై నిషేధం కొనసాగుతున్నప్పటికీ అలాంటి ఘటనలే తరుచూ జరుగుతుండటంతో సుప్రీం తీర్పు ప్రాధాన్యతను సంతరించుకుంది.