నగరంలో ఎక్కడైనా పార్కింగ్ ఫ్రీ

నగరంలో ఎక్కడైనా పార్కింగ్ ఫ్రీ

హైదరాబాద్: నగరంలో పార్కింగ్‌ ఫీజు దందా అడ్డగోలుగా సాగుతోంది. పార్కింగ్‌ ఫీజులను అధికంగా వసూలు చేయడంపై ప్రజల నుంచి పెద్ద ఎత్తున విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. రూ.పది సరుకు కొన్నా రూ.20 నుంచి రూ.50 పార్కింగ్‌ ఫీజు చెల్లించాల్సి వస్తోంది. ఈ దోపిడీపై కొందరు పోలీస్‌ స్టేషన్లలో ఫిర్యాదులు  కూడా చేస్తున్నారు. వీటిని పరిగణనలోకి తీసుకుని తాజా ఈ దోపిడీకి చెక్‌ చెప్పాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది.

మంగళవారం మంత్రి కేటీఆర్‌ సమక్షంలో జరిగిన సమావేశంలో ఈ కీలక నిర్ణయం తీసుకున్నారు. మాల్స్‌, థియేటర్లు, వాణిజ్య సముదాయాలు, హోటళ్లు, కళ్యాణ మండపాలు, పరిశ్రమల భవనాల్లో ఉచిత పార్కింగ్‌ను తప్పనిసరి చేయనున్నారు.సినిమాహాళ్లు, షాపింగ్‌ మాల్స్‌లో పార్కింగ్‌ దోపిడీ అంశం ప్రస్తావనకు రాగా ఇక పై ఎలాంటి ఫీజు వసూలు చేయరాదని నిర్ణయించినట్లు తెలిసింది. 

నగరంలోని కొన్ని మాల్స్‌లో ఇప్పటికే ఈ పద్ధతి అమలులో ఉంది. సెల్లార్‌లో పార్కింగ్‌ చేయగానే ఫీజు వసూలు చేసి రసీదు ఇస్తారు. షాపింగ్‌ ముగిశాక బిల్లు చెల్లించేటప్పుడు రసీదు చూపిస్తే ఆ మేరకు బిల్లులో మినహాయింపు ఇస్తున్నారు. సినిమా థియేటర్లలో సినిమా టికెట్‌ను చూపిస్తే సరిపోతుంది. ఈ విధానాన్ని నగరంతోపాటు రాష్ట్రంలోని అన్ని కార్పొరేషన్లలో అమలు చేయనున్నారు.

పార్కింగ్‌ పాలసీలో ఈ ఉచిత అంశం లేకపోయినా దీనికి సంబంధించి త్వరలోనే ప్రత్యేక జీవో జారీ కానున్నట్లు తెలసింది. వచ్చే ఏడాది లోగా ఈ ఫ్రీ పార్కింగ్‌ అమలులోకి వచ్చే అవకాశం ఉంది.ఆయా వాణిజ్య సంస్థల్లో కొనుగోళ్లకు వెళ్లిన వారికే ఈ ఉచిత సదుపాయం కల్పించేందుకు, ఇతరులు పార్కింగ్‌ ప్రదేశాల్లో గంటల తరబడి పార్కింగ్‌ చేయకుండా ఉండేందుకు ఆయా  షాపులకు వెళ్లిన వారికి బిల్లులో పార్కింగ్‌ ఫీజు మేరకు మినహాయింపు ఇవ్వనున్నారు.

ప్రైవేట్‌ వాణిజ్య సంస్థలే ఫ్రీ పార్కింగ్‌ కల్పిస్తున్నప్పుడు ఆర్టీసీ, రైల్వే, మెట్రో రైలు స్టేషన్లలోనూ ఫ్రీ పార్కింగ్‌ కల్పించాలనే డిమాండ్‌ వస్తోంది. రైల్వే ప్లాట్‌ఫారం టికెట్‌ కొనుగోలు చేసినవారు దాన్ని చూపితే సరిపోతుందని, ఆర్టీసీ బస్టాండ్లలో రోజుల తరబడి పార్కింగ్‌ చేయకుండా ఉండేలా తగిన విధానాలు రూపొందించాలనే అభిప్రాయం వ్యక్తమవుతోంది.

పార్కింగ్‌ సమస్యల పరిష్కారానికి GHMC లో ఇప్పటికే పలు చర్యలు చేపట్టారు. రోడ్ల వెంబడి పార్కింగ్‌ లాట్లలో ఫీజుల్ని ఎత్తివేశారు. గతేడాది అక్టోబర్‌ నుంచి 134 పార్కింగ్‌ లాట్లలో ఫీజును ఎత్తేశారు. జీహెచ్‌ఎంసీ నిబంధనల ప్రకారం వ్యాపార, వాణిజ్య కార్యకలాపాలు నిర్వహించే సముదాయాల్లో కొనుగోళ్లకు వచ్చేవారికి ఉచిత పార్కింగ్‌ కల్పించాల్సి ఉండటంతో సినిమాహాళ్లతోపాటు హోటళ్లు, రెస్టారెంట్లు, వినోద కేంద్రాలు తదితర ప్రాంతాల్లోనూ ఫ్రీ పార్కింగ్‌ను అమలు చేసే దిశలో అధికారులు ఉన్నారు.

ప్రధాన రహదారుల్లో పార్కింగ్‌ సమస్యను తీర్చడానికి ట్రాఫిక్‌ పోలీసులు కమ్యూనిటీ పార్కింగ్‌ విధానాన్ని ప్రతిపాదించారు. షాపింగ్‌ కాంప్లెక్స్‌లు, వాణిజ్య ప్రాంతాలు ఎక్కువగా ఉన్న చోట ఖాళీ ప్రాంతాన్ని గుర్తించి, కమ్యూనిటీ పార్కింగ్‌ ప్రాంతంగా ప్రకటిస్తారు. ఆ ప్రాంతంలో అవసరమైన మౌలిక వసతుల కల్పన, మూడు షిఫ్టుల్లో పని చేసేలా సెక్యూరిటీ ఏర్పాటు, ఆ ప్రాంతం నిర్వహణ బాధ్యతల్ని స్థానిక వర్తక సంఘాలకు అప్పగించాలి. దీనిపై త్వరలో తగు చర్యలు తీసుకోనున్నారు.