>

నేర రహిత తెలంగాణే లక్ష్యం

నేర రహిత తెలంగాణే లక్ష్యం

హైదరాబాద్: తెలంగాణ రాష్ట్ర డీజీపీ కార్యాలయంలో అనురాగ్ శర్మ నుంచి డీజీపీగా మహేందర్‌రెడ్డి బాధ్యతలు స్వీకరించిన అనంతరం మహేందర్‌రెడ్డి మీడియాతో మాట్లాడారు. డీజీపీగా బాధ్యతలు అప్పగించిన ముఖ్యమంత్రి కేసీఆర్‌కు ధన్యవాదాలు తెలిపారు. తెలంగాణను నేర రహిత రాష్ట్రంగా తీర్చిదిద్దడమే తన లక్ష్యమని నూతన డీజీపీ మహేందర్‌రెడ్డి స్పష్టం చేశారు. తెలంగాణ రాష్ట్ర రెండో డీజీపీగా బాధ్యతలు స్వీకరించడం చాలా సంతోషంగా ఉందన్నారు.

 తెలంగాణ పోలీసులు దేశంలోనే నెంబర్ వన్ అని కొనియాడారు మహేందర్‌రెడ్డి. సీఎం కేసీఆర్ పోలీసు శాఖకు అధిక ప్రాధాన్యం ఇచ్చారని పేర్కొన్నారు. రాష్ట్రంలో పోలీసు వ్యవస్థ ఉన్నతికి ప్రభుత్వం సహకారం అందిస్తుందని స్పష్టం చేశారు. ఫ్రెండ్లీ పోలీసింగ్‌ను మరింత సమర్థవంతంగా అమలు చేస్తామన్నారు. హైదరాబాద్ సిటీలో నేను సైతం ప్రాజెక్టు అద్భుత ఫలితాలను ఇచ్చిందని గుర్తు చేశారు.

తెలంగాణ ప్రభుత్వం చొరవతో పోలీసు శాఖలో 18,500 పోస్టులు భర్తీ చేసినట్లు గుర్తు చేశారు. టెక్నాలజీని ఉపయోగించి శాంతిభద్రతలను అదుపులో పెడుతామన్నారు. చిన్న చిన్న సైబర్ నేరాలను మొదట్లోనే అరికడితే.. పెద్ద పెద్ద నేరాలు జరగవు అని డీజీపీ చెప్పారు. సైబర్ క్రైమ్స్‌ను అరికట్టేందుకు జిల్లాల్లో ల్యాబ్స్ ఏర్పాటు చేస్తామని ప్రకటించారు. చిన్న పిల్లలపై లైంగికదారులపై కఠిన చర్యలు తీసుకుంటామని మహేందర్‌రెడ్డి స్పష్టం చేశారు. హోంగార్డుల సమస్యలపై ప్రభుత్వంతో చర్చించి పరిష్కరిస్తామని పేర్కొన్నారు.

నగరంలో సీసీ కెమెరాలను భారీగా ఏర్పాటు చేస్తామని ప్రకటించారు. విధుల్లో ఉత్తమ ప్రతిభ కనబరిచిన వారికి గుర్తింపు ఇస్తామన్నారు. శాంతి భద్రతల పరిరక్షణకు సమాజ భాగస్వామ్యం అవసరమన్న డీజీపీ.. స్థానికులతో పోలీసులు మమేకం కావాలన్నారు. సాంకేతిక పరిజ్ఞానంతో పోలీసుల సేవల్లో నాణ్యత పెంచుతామన్నారు. రాష్ట్ర ప్రభుత్వం మహిళల భద్రతకు పెద్దపీట వేసిందన్నారు. నగరంలో షీ టీమ్స్‌తో ఆకతాయిల ఆగడాలను అరికట్టామని మహేందర్‌రెడ్డి చెప్పారు. రాష్ట్ర వ్యాప్తంగా భరోసా సెంటర్లు, మహిళల భద్రత కోసం షీ టీమ్స్‌ను విస్తరిస్తామని తెలిపారు.