న్యాయవాదులకు ఆరోగ్య బీమా పథకం

న్యాయవాదులకు ఆరోగ్య బీమా పథకం

  హైదరాబాద్ : న్యాయవాదులకు ఆరోగ్య బీమా పథకాన్ని వర్తింపజేస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. న్యాయవాదుల సంక్షేమ పథకాల అమలుపై ఆ శాఖ మంత్రి ఇంద్రకరణ్‌రెడ్డి సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి ఇంద్రకరణ్‌రెడ్డి మాట్లాడుతూ.. న్యాయవాదులకు ఆరోగ్య, ప్రమాద బీమా సౌకర్యం కల్పించడం, బార్ అసోసియేషన్లకు మౌలిక సదుపాయాల కల్పనపై చర్చించినట్లు తెలిపారు. న్యాయవాదితో పాటు ఆయన జీవిత భాగస్వామికి రూ. 2 లక్షల వరకు ఆరోగ్య బీమా పథకం అమలు చేయనున్నారు. మరణించిన న్యాయవాదుల కుటుంబాలకు ప్రమాద బీమా పథకం కింద రూ. 10 లక్షలు ఆర్థిక సాయం అందించాలని నిర్ణయించారు. 


ఆయా జిల్లాల్లోని బార్ అసోసియేషన్లకు మెరుగైన వసతుల కల్పన.. ఫర్నీచర్, లైబ్రరీ, ఇతర నిర్వహణ ఖర్చుల కోసం న్యాయవాదుల సంఖ్యను బట్టి ఆర్థిక సాయం అందించనున్నారు. నల్సార్ యూనివర్సిటీ సహకారంతో జూనియర్ న్యాయవాదులకు క్రిమినల్, సివిల్ ప్రోసీజర్ కోడ్, డ్రాప్టింగ్‌పై శిక్షణ తరగతులు నిర్వహించాలని సమావేశంలో నిర్ణయించారు. ఆరోగ్య, ప్రమాదబీమా పథకాలను జూన్ 2న ప్రారంభించనున్నట్లు మంత్రి ఇంద్రకరణ్‌రెడ్డి వెల్లడించారు. అదే రోజు లాంఛనంగా న్యాయవాదులకు హెల్త్‌కార్డులను జారీ చేయనున్నట్లు పేర్కొన్నారు. న్యాయవాదుల సంక్షేమ నిధికి రూ. 100 కోట్లను కేటాయించిన సంగతి తెలిసిందే. 

ఈ సమావేశంలో ఎంపీ వినోద్ కుమార్, న్యాయ శాఖ కార్య‌ద‌ర్శి నిరంజ‌న్ రావు, ఆర్థికశాఖ ముఖ్య కార్యదర్శి రామకృష్ణా రావు, ట్రస్ట్‌ కార్యదర్శి, న్యాయశాఖ అద‌న‌పు కార్యదర్శి బాచిన రామాంజనేయులు, హైకోర్టు సీనియ‌ర్ న్యాయ‌వాదులు గండ్ర మోహ‌న్ రావు, రాజేందర్ రెడ్డి, స‌హోద‌ర్ రెడ్డి, మానిక్ ప్ర‌భు గౌడ్, వెంక‌ట్ యాద‌వ్, విద్యాసాగ‌ర్ రావు, మ‌హ‌మూద్ అలీ, ట్ర‌స్ట్ స‌ల‌హా మండ‌లి స‌భ్యులు,ఇత‌ర న్యాయ‌వాదులు పాల్గోన్నారు.