ప్రయాణికులతో కిక్కిరిసిన రైల్వేస్టేషన్లు, బస్టాండ్‌లు

ప్రయాణికులతో కిక్కిరిసిన రైల్వేస్టేషన్లు, బస్టాండ్‌లు

  హైద‌రాబాద్: సంక్రాంతి పండుగ సంద‌ర్భంగా నగరవాసులు సొంతూళ్లకు బయల్దేరారు. దీంతో న‌గ‌రంలోని ప్రయాణ ప్రాంగణాలన్నీ ప్రయాణీకులతో కిక్కిరిసిపోయాయి. నేటి నుంచి సెల‌వులు కావ‌డంతో సికింద్రాబాద్‌, నాంపల్లి రైల్వేస్టేషన్లతో పాటు జేబీఎస్‌, ఎంజీబీఎస్‌ ఆర్టీసీ బస్టాండ్ల నుంచి ప్రజలు తమ స్వగ్రామాలకు బయల్దేరి వెళ్తున్నారు. అలాగే ప్ర‌ధాన కూడ‌ళ్ల‌లో ఏర్పాటు చేసిన ప్ర‌యాణ ప్రాంగ‌ణాలు ర‌ద్దీగా ఉన్నాయి. సిటీ బస్సులను కూడా కరీంనగర్‌, వ‌రంగ‌ల్‌, ఖ‌మ్మం, నిజామాబాద్‌, మ‌హ‌బూబ్‌న‌గ‌ర్ జిల్లాల‌కు నడుపుతున్నారు. 


హైదరాబాద్-కరీంనగర్, హైదరాబాద్-వరంగల్, హైద‌రాబాద్-విజ‌య‌వాడ‌ రహదారులపై ఉన్న టోల్‌ప్లాజాల ద‌గ్గ‌ర‌ విపరీతమైన రద్దీ నెలకొంది. కొన్ని టోల్‌ప్లాజాల వద్ద వాహనదారులకు ఇబ్బంది లేకుండా అదనపు కౌంటర్లు ఏర్పాటు చేశారు. సంక్రాంతి పండుగకు తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ విస్తృత ఏర్పాట్లు చేసింది. తెలంగాణ ప్రాంతాల్లోని వివిధ జిల్లాలకు 3,673, సీమాంధ్ర ప్రాంతానికి 1,579 ప్రత్యేక బస్సులు నడుపుతున్నారు.