రావూస్ స్కూల్ పై క‌డియం ఆగ్రహం

రావూస్ స్కూల్ పై క‌డియం ఆగ్రహం

హైదరాబాద్: సంగారెడ్డి జిల్లాలోని బీహెచ్ఈఎల్ లోని రావూస్ హైస్కూల్ యూనిఫాం వేసుకోలేదని ఐదో తరగతి చదువుతున్న విద్యార్థినిని అబ్బాయిల టాయిలెట్స్ వద్ద నిలబెట్టిన సంఘటన పై డిప్యూటీ సీఎం, విద్యాశాఖ మంత్రి కడియం శ్రీహరి ఆగ్రహం వ్యక్తం చేశారు. వెంటనే స్కూల్ ను తనిఖీ చేసి నివేదిక ఇవ్వాలని విద్యాశాఖ అధికారులను ఆదేశించారు. హైదరాబాద్ పరిధిలోని ఒక స్కూల్ లో యూనిఫాం లేదని అబ్బాయిల టాయిలెట్ వద్ద అమ్మాయిని నిలబెట్టారని ట్విట్టర్ లో వచ్చిన పోస్టింగ్ పై మంత్రి కేటీఆర్ స్పందించారు. ఇలాంటి సంఘటనలు జరగకూడదని, దీనిని వెంటనే విద్యాశాఖ మంత్రి దృష్టికి తీసుకెళ్తానని ట్విట్టర్ లో కేటీఆర్ ప్రతిస్పందించారు. 

మంత్రి కేటీఆర్ ట్వీట్ పై స్పందించిన కడియం శ్రీహరి అమ్మాయిని బాయ్స్ టాయిలెట్స్ వద్ద నిలబెట్టిన హైస్కూల్ కు విద్యాశాఖ అధికారులు వెంటనే వెళ్లి తనిఖీ చేసి నివేదిక ఇవ్వాలని ఆదేశించారు. కడియం ఆదేశాల మేరకు ఇద్దరు డీఈవోలు సత్యానారాయణ రెడ్డి, విజయకుమారి రావూస్ హైస్కూల్ ను తనిఖీ చేశారు. ఐదో తరగతి విద్యార్థిని యూనిఫాం వేసుకురానందున స్కూల్ పీఈటీ అమ్మాయిని బాయ్స్ టాయిలెట్స్ వద్ద నిలబెట్టింది వాస్తవమేనని ధృవీకరించారు. 

స్కూల్ యాజమాన్యంతో దీనిపై చర్చించడంతో...స్కూల్ మేనేజ్ మెంట్ సదరు పీఈటీని వెంటనే తొలగించినట్లు అధికారుల దృష్టికి వచ్చింది. స్కూల్ ను తనిఖీ చేసిన అధికారులు జరిగిన సంఘటన, స్కూల్ మేనేజ్ మెంట్ తీసుకున్న చర్యలను వివరిస్తూ ప్రభుత్వానికి నివేదిక అందించనున్నారు. నివేదిక అందిన వెంటనే తగిన చర్యలు తీసుకుంటామని ఉప ముఖ్యమంత్రి, విద్యాశాఖ మంత్రి కడియం శ్రీహరి స్పష్టం చేశారు.