‘రాష్ట్రభివృద్ధి కోసం ఐసీసీతో కలిసి పని చేస్తాం’

‘రాష్ట్రభివృద్ధి కోసం ఐసీసీతో కలిసి పని చేస్తాం’

  హైదరాబాద్ : పార్క్ హయత్‌లో ఇండియన్ ఛాంబర్స్ ఆఫ్ కామర్స్ సదరన్ రీజినల్ కౌన్సిల్(ఐసీసీఎస్‌ఆర్‌సీ) సమావేశం జరిగింది. ఐసీసీఎస్‌ఆర్‌సీ చైర్మన్‌గా తిక్కవరపు రాజీవ్ రెడ్డి బాధ్యతలు స్వీకరించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్ హాజరయ్యారు.ఈ సందర్భంగా కేటీఆర్ మాట్లాడుతూ.. గత రెండు దశాబ్దాలలో దేశంలో విప్లవాత్మక మార్పులు వచ్చాయన్నారు. ఎన్ని కంపెనీలు ఉన్నాయన్నది ముఖ్యం కాదు.. ఎంత ఉపాధి కల్పించామన్నది ముఖ్యమని కేటీఆర్ పేర్కొన్నారు. హైదరాబాద్‌లో పెట్టుబడులకు అద్భుతమైన అవకాశాలు ఉన్నాయని స్పష్టం చేశారు. ఉత్పత్తి రంగంలో జర్మనీని ఆదర్శంగా తీసుకోవాలని సూచించారు. రాష్ర్టాభివృద్ధి కోసం ఇండియన్ ఛాంబర్ ఆఫ్ కామర్స్‌తో కలిసి పని చేస్తామని తెలిపారు. 


గత నాలుగేళ్లలో తెలంగాణలో ఎంతో అభివృద్ధి సాధించామని ఉద్ఘాటించారు. రాష్ట్రం ఏర్పడిన ఆరు నెలల్లోనే విద్యుత్ సమస్యను అధిగమించామని కేటీఆర్ చెప్పారు. సోలార్ విద్యుత్ ఉత్పత్తిలో దేశంలో రెండో స్థానంలో ఉందన్నారు. గ్రామీణ ఆర్థిక వ్యవస్థ బలోపేతం కోసం సీఎం కేసీఆర్ కృషి చేస్తున్నారని కేటీఆర్ స్పష్టం చేశారు. టీఎస్ ఐపాస్‌తో రాష్ర్టానికి పెట్టుబడులు తరలి వచ్చాయన్న మంత్రి.. పరిశ్రమలకు 15 రోజుల్లోనే అనుమతులు ఇస్తున్నామని పేర్కొన్నారు. ఇండస్ట్రియల్ హెల్త్ క్లినిక్‌తో పరిశ్రమలను పునరుద్ధరిస్తున్నామని కేటీఆర్ వెల్లడించారు.