‘రీజినల్‌’ డీపీఆర్‌ వేగవంతం....

‘రీజినల్‌’ డీపీఆర్‌ వేగవంతం....

  హైదరాబాద్‌ : ప్రతిష్టాత్మక ప్రాజెక్టు రీజినల్‌ రింగ్‌ రోడ్‌ సమగ్ర ప్రాజెక్టు నివేదిక (డీపీఆర్‌) పనులు శరవేగంగా సాగుతున్నాయి. తాజాగా ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్‌రావు పనుల పురోగతిపై ఆర్‌ అండ్‌ బీ అధికారులకు ఫోన్‌ చేసి వివరాలు తెలుసుకున్నారు. వీలైనంత త్వరగా డీపీఆర్‌ పనులు పూర్తి చేయాలని ఆదేశించినట్లు సమాచారం. రాజధానిపై ట్రాఫిక్‌ కష్టాలను తీర్చడంతో పాటు ఇతర రాష్ట్రాల నుంచి కనెక్టివిటీ పెంచేందుకు తెలంగాణ ప్రభుత్వం ఈ ట్రిపుల్‌ ఆర్‌ నిర్మించాలన్న పట్టుదలతో ఉంది. అందుకే, సీఎం ఈ ప్రాజెక్టును ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారు. దీంతో అధికారులు పనుల వేగం పెంచేందుకు సమాయత్తమవుతున్నారు. పార్లమెంటులో కేంద్ర సహాయ మంత్రి మాండవీయ రీజినల్‌ రింగ్‌రోడ్డులోని రెండు రోడ్ల నిర్మాణానికి అంగీకారాన్ని వెల్లడించారు. భూసేకరణలో తెలంగాణ ప్రభుత్వం సగం ఖర్చు భరిస్తుందని తెలిపారు. ఈ నేపథ్యంలో సీఎం కేసీఆర్‌ కూడా డీపీఆర్‌ పనులపై ఆరాతీయడం ప్రాధాన్యం సంతరించుకుంది. విశ్వసనీయ సమాచారం మేరకు వచ్చే వారాంతానికి డీపీఆర్‌ పనులు పూర్తికానున్నాయి.