>

రేపు రాష్ట్రవ్యాప్తంగా గొర్రెల పంపిణీ

రేపు రాష్ట్రవ్యాప్తంగా గొర్రెల పంపిణీ

 హైదరాబాద్ : గ్రామీణ తెలంగాణకు జవసత్వాలు తెచ్చి, గ్రామాల్లోనే వేల కోట్ల సంపదను సృష్టించాలన్న మహోన్నత లక్ష్యంతో గొర్రెల పంపిణీ పథకానికి ప్రభుత్వం మంగళవారం శ్రీకారం చుట్టబోతున్నది. రాష్ట్రవ్యాప్తంగా నాలుగు లక్షల యాదవ కుటుంబాలకు లబ్ధిచేకూర్చేలా 75 శాతం సబ్సిడీపై రెండేండ్లలో 84 లక్షల గొర్రెలు పంపిణీ చేయనున్నట్టు ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌రావు ఇప్పటికే ప్రకటించారు. గొర్రెల పంపిణీకి పశుసంవర్ధకశాఖ, గొర్రెలు, మేకల అభివృద్ధి సహకార సమాఖ్య లిమిటెడ్ అన్నిఏర్పాట్లు పూర్తిచేశాయి.

గొర్రెల పంపిణీని మంగళవారం సిద్దిపేట జిల్లా గజ్వేల్ నియోజకవర్గంలోని కొండపాక మండల కేంద్రంలో ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌రావు ప్రారంభించనున్నారు. అన్ని జిల్లాల్లోనూ ఆయా జిల్లాల మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఇతర ప్రజాప్రతినిధులు లబ్ధిదారులకు గొర్రెలను పంపిణీ చేయనున్నారు. 30 లక్షల యాదవుల జనాభా ఉన్న రాష్ట్రం రోజుకు 600 లారీల గొర్రెలను దిగుమతి చేసుకునే పరిస్థితి పోయి మాంసం ఎగుమతి చేసే స్థితికి ఎదుగాలన్నదే ఈ పథకం లక్ష్యమని సీఎం కేసీఆర్ గతంలోనే చెప్పారు. రెండేండ్లలో రూ.20వేల కోట్ల సంపదను సృష్టించే అద్భుతమైన అవకాశాలు గొర్రెల పెంపకంలో యాదవులకు ఉన్నాయని వివరించారు.