>

సత్ఫలితాలని సాధిస్తున్న పోలీసు శాఖ వెబ్ సైట్

సత్ఫలితాలని సాధిస్తున్న పోలీసు శాఖ వెబ్ సైట్

హైదరాబాద్: తెలంగాణ పోలీసు శాఖ వెబ్ సైట్ ద్వారా ప్రజలకు మరింత దగ్గరైంది. ఈ ఏడాది మార్చిలో అందుబాటులోకి వచ్చిన ఈ సర్వీస్‌ ద్వారా 1.68 లక్షల మందిఎఫ్‌ఐఆర్‌ అక్నాల్డెజ్‌మెంట్‌ స్వీకరించారు. పోలీస్‌ వెబ్‌సైట్‌ ద్వారా అదృశ్యమైన వ్యక్తుల వివరాలను 15,288 మంది తెలుసుకోగా, 83 మంది ఆన్‌లైన్‌లో ఫిర్యాదు చేశారు. ఫిర్యాదు, కేసు నమోదు తర్వాత అరెస్టయిన నిందితుల వివరాలను 10,288 మంది తెలుసుకోగా 1,011 మంది పిటిషన్‌ పరిస్థితిని పరిశీలించుకున్నారు. అలాగే గతేడాది నవంబర్‌ నుంచి ఇప్పటివరకు 7,780 మంది ఎఫ్‌ఐఆర్‌ డౌన్‌ లోడ్‌ చేసుకున్నారు.

మరోవైపు పోలీస్‌ వెబ్‌సైట్‌ ను ఇప్పటివరకు 7.7 లక్షల మంది వీక్షించారు. ఫిర్యాదులు, కేసుల స్థితిని సులభంగా తెలుసుకునేలా అందుబా టులోకి తీసుకొచ్చిన క్రైమ్‌ అండ్‌ క్రిమినల్‌ ట్రాకింగ్‌ నెట్‌వర్క్‌ సిస్టమ్‌ (సీసీటీఎన్‌ఎస్‌) సత్ఫలితాలనిస్తోంది.‘నమస్కారం మీరు దాఖలు చేసిన ఫిర్యాదు స్వీకరించాం. ఫిర్యాదు చేసిన అంశాలపై పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేశాం. అందుకు సంబంధించి ఎఫ్‌ఐఆర్‌ నంబర్‌ xxx  ధన్యవాదాలు’ ఇలా 24 గంటల్లోపు పిటిషన్‌ నంబర్, తదితర వివరాలతో సంక్షిప్త సందేశం ఫిర్యాదుదారులకు అందుతోంది.

అలాగే ఎఫ్‌ఐఆర్‌ కాపీ కోసం ఫిర్యాదుదారులు పోలీస్‌ స్టేషన్‌కు వెళ్లకుండా ‘”www.tspolice.gov.in’’ వెబ్‌సైట్‌ నుంచి డౌన్‌లోడ్‌ చేసుకోవచ్చు. వెబ్‌సైట్‌లో అకౌంట్‌ క్రియేట్‌ చేసుకొని సంబంధిత జిల్లా, పోలీస్‌ స్టేషన్‌ నుంచి ఎఫ్‌ఐఆర్‌ నంబర్‌ లేదా ఎఫ్‌ఐఆర్‌ నమోదు తేదీని ధృవీకరించుకొని కాపీని డౌన్‌లోడ్‌ చేసుకోవచ్చు. పిటిషన్‌పై కేసు నమోదు చేయకపోతే.. పిటిషన్‌ ప్రస్తుత పరిస్థితిని వెబ్‌సైట్‌లో పొందుపరుస్తున్నారు.