తెలంగాణ పోలీసులు దేశంలోనే నెం-1

తెలంగాణ పోలీసులు దేశంలోనే నెం-1

హైదరాబాద్:ఈ రోజు ప్రగతిభవన్‌లో డీజీపీగా పదవీ విరమణ చేసిన అనురాగ్‌శర్మకు ప్రభుత్వం ఘనంగా విడ్కోలు పలికింది. ఈ సభలో సీఎం కెసిఆర్ మాజీ డీజీపీ అనురాగ్‌శర్మను సన్మారించారు.శాంతిభద్రతల పరిరక్షణ, పోలీసింగ్ కొత్త విధానాలు అమలు చేయడంలో తెలంగాణ పోలీసులు దేశంలోనే నెంబర్‌వన్‌గా నిలవడం గర్వంకారణమన్నారు సీఎం కేసీఆర్. తెలంగాణ రాష్ట్రం ఏర్పడితే శాంతి భద్రతల సమస్య తలెత్తుతుందనే అపోహలను, దుష్ప్రచారాలను పటాపంచలు చేసినం.

 తెలంగాణను సహనశీల రాష్ట్రంగా ఆవిష్కరించిన ఘనత పోలీసు శాఖకు, మూడున్నరేళ్లపాటు డీజీపీగా పనిచేసి పోలీసులకు నాయకత్వం వహించిన అనురాగ్‌శర్మకు దక్కుతుందని కొనియాడారు.తెలంగాణ పోలీసులు కేవలం తమ విధి నిర్వహణకే కాకుండా అనేక సామాజిక బాధ్యతలను నెరవేరుస్తున్నారు.

తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన కొత్తలో ఉన్న సంక్లిష్ట పరిస్థితుల్లో గొప్ప రక్షణ వ్యవస్థగా పోలీసు వ్యవస్థను తీర్చిదిద్దడానికి అనురాగ్‌శర్మ శ్రమించారు, ఇది చరిత్రలో నిలిచిపోతుందని కెసిఆర్ అన్నారు. మానవ ప్రవృత్తిలో చంచలత్వం ఉన్నంతకాలం భూమిపై శాంతి భద్రతల సమస్య ఉంటుంది. శాంతి భద్రతల నిర్వహణ నిరంతర ప్రక్రియ. ఎంతో తెలివి, సమన్వయం, కొత్త ఆలోచనలతో విధులు నిర్వహించాల్సి ఉంటుంది. వినూత్నంగా ఆలోచించి కొత్త విధానాలు నెలకొల్పడానికి కొత్త ప్రయోగాలు చేయడానికి ఆకాశమే హద్దని తెలిపారు సీఎం కేసీఆర్.

ఈ కార్యక్రమంలో డిప్యూటీ సీఎంలు కడియం శ్రీహరి, మహమూద్ అలీ,  మంత్రులు పోచారం శ్రీనివాస్‌రెడ్డి, నాయిని నర్సింహారెడ్డి, తుమ్మల నాగేశ్వరరావు, జగదీశ్‌రెడ్డి, ఇంద్రకరణ్‌రెడ్డి, జోగురామన్న, ప్రభుత్వ ముఖ్య సలహాదారు రాజీవ్‌శర్మ, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎస్పీసింగ్, డీజీపీ మహేందర్‌రెడ్డి, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, కార్పోరేషన్ల చైర్మన్లు, ఐఏఎస్, ఐపీఎస్ అధికారులు పాల్గొన్నారు.