తొలివిడుతకు నేడు పోలింగ్

తొలివిడుతకు నేడు పోలింగ్

  హైదరాబాద్ : పంచాయతీ ఎన్నికల్లో భాగంగా తొలివిడుత పోలింగ్ సోమవారం జరుగునున్నది. గ్రామ పంంచాయతీ ఎన్నికలకోసం గతేడాది ఆగస్టునుంచి ఎదురుచూస్తున్న పల్లెవాసులు సోమవారం ఓటువేసి తమ గ్రామ మొదటి పౌరున్ని ఎన్నుకోనున్నారు. పోలింగ్‌కు రాష్ట్ర ఎన్నికల సంఘం ఏర్పాట్లు పూర్తిచేసింది. తొలివిడుతలో 4,479 గ్రామాల్లో ఎన్నికలు జరుగాల్సి ఉండగా, రిజర్వేషన్లు కలిసిరాకపోవడం, కోర్టు కేసుల నేపథ్యంలో తొమ్మిది గ్రామాలకు ఎన్నికలు నిర్వహించడంలేదు. ఈ విడుతలో 769 పంచాయతీలు ఏకగ్రీవమయ్యాయి. దీంతో 3,701 గ్రామాల్లో ఎన్నికలు నిర్వహిస్తుండగా, 12,202 మంది సర్పంచ్ అభ్యర్థులు బరిలో నిలిచారు. 39,822 వార్డుస్థానాలకు ఎన్నికలు జరుగాల్సి ఉండగా, కోర్టు కేసులు, రిజర్వేషన్లు అనుకూలంగా లేకపోవడంతో 192 వార్డుల్లో ఎన్నికలు వాయిదా పడ్డాయి. 10,654 వార్డులు ఏకగ్రీవమయ్యాయి. ప్రస్తుతం 28,976 వార్డులకు పోలింగ్ జరుగుతుండగా, 70,094 మంది పోటీ పడుతున్నారు.

 3,701 గ్రామాల్లో సోమవారం ఉదయం 7 గంటలనుంచే పోలింగ్ మొదలుకానున్నది. మధ్యాహ్నం ఒంటిగంటవరకే పోలింగ్ నిర్వహిస్తారు. మధ్యాహ్నం 2 గంటలనుంచి ఓట్ల లెక్కింపు ప్రారంభిస్తారు. ముందుగా వార్డుస్థానాలు, తర్వాత సర్పంచ్‌స్థానాల ఓట్లను లెక్కిస్తారు. లెక్కింపు తర్వాత ఉప సర్పంచ్ ఎన్నికకు అధికారులు నోటిఫికేషన్ జారీచేస్తారు. ఆయా గ్రామపంచాయతీ కార్యాలయాలు లేదా పోలింగ్ కేంద్రాల శివారు ప్రాంతాల్లోని కార్యాలయాల్లో ఉప సర్పంచ్ ఎన్నిక నిర్వహిస్తారు. చేతులెత్తే పద్ధతిలోనే ఈసారి కూడా ఉప సర్పంచ్‌ను ఎన్నుకుంటారు. తొలివిడుత ఎన్నికల కోసం 1,48,033 మంది పోలింగ్ సిబ్బందిని వినియోగిస్తున్నారు. 26 వేల మంది పోలీసులతో బందోబస్తు నిర్వహిస్తున్నారు.