ట్రిపుల్ రైడ్ లో అందరూ ఫైన్ కట్టాల్సిందే

 ట్రిపుల్ రైడ్ లో అందరూ ఫైన్ కట్టాల్సిందే

హైదరాబాద్: హైదరాబాద్ బైక్ రైడర్స్ కు సంభందించి నగర పోలీసులు కొత్త రూల్స్ అమలు చెయ్యబోతున్నారు.ట్రిపుల్ రైడింగ్ కి జరిమానాగా వెయ్యి రూపాయలు ఇప్పటి వరకు వసూలు చేసేవారు. ఇక నుంచి మూడు వేల రూపాయల ఫైన్ వేయనున్నారు. బండి నడిపే వ్యక్తికి వెయ్యి కట్టాల్సి ఉంటే.. వెనక కూర్చున్న ఇద్దరూ కూడా తలో వెయ్యి రూపాయలు జరిమానా కింద కట్టాలి. హైదరాబాద్ బైక్ రైడర్స్ కు షాకింగ్ లాంటి ఈ డెసిషన్ ను అమలు చేయబోతున్నారు ట్రాఫిక్ పోలీసులు.

ట్రిపుల్ రైడింగ్ చట్టాన్ని కఠినతరం చేస్తూ.. ఈ నిబంధనలను హైదరాబాద్, సైబరాబాద్, రాచకొండ కమిషనరేట్ల పరిధిలో అమలు చేసే విధంగా నివేదికను తయారు చేస్తున్నారు. బైక్ నడిపే వ్యక్తితోపాటు వెనక కూర్చున్న మిగతా ఇద్దరికీ కూడా చెరో వెయ్యి రూపాయల జరిమానా విధిస్తే.. మార్పు వస్తుందని భావిస్తున్నాం అంటున్నారు రాచకొండ అధికారులు. నివేదిక తుదిరూపు తర్వాత ప్రభుత్వ నిర్ణయం మేరకు మాత్రమే అమలు చేస్తామని వెల్లడించారు. అప్పటి వరకు ఇప్పటి రూల్సే అమల్లో ఉంటాయన్నారు.

ముఖ్యంగా యువతలో మార్పు కోసం ఈ కఠిన నిబంధన అమలు చేస్తున్నారు. మోటార్ వెహికల్ యాక్ట్ 188 కింద వెయ్యి ఫైన్ వేస్తున్నారు. అయినా యూత్ లో మార్పు రాలేదు. కేవలం రాచకొండ కమిషనరేట్ పరిధిలోనే ఐదు నెలల్లో 10వేల ట్రిపుల్ రైడింగ్ కేసులు నమోదు అయ్యాయి. 10 లక్షల రూపాయల ఫైన్ విధించారు. కేసులు నమోదు చేసి.. కుర్రోళ్ల తల్లిదండ్రులకు కూడా సమాచారం ఇస్తున్నారు. యువతకు కౌన్సెలింగ్ ఇస్తున్నారు. అయినా రోజు రోజుకి కేసులు పెరగటంతో ట్రిపుల్ రైడింగ్ లో ఉండే మిగతా ఇద్దరికీ ఫైన్ వేసే విధంగా చట్టాన్ని సవరించాలని ప్రభుత్వానికి నివేదిక ఇచ్చింది ట్రాఫిక్ డిపార్ట్ మెంట్.