ఉమ్మడి హైకోర్టు సీజేగా రాధాకృష్ణన్

ఉమ్మడి హైకోర్టు సీజేగా రాధాకృష్ణన్

 హైదరాబాద్ :తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ర్టాల ఉమ్మడి హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి (సీజే)గా జస్టిస్ తోట్టత్తిల్ బీ రాధాకృష్ణన్ బాధ్యతలు చేపట్టనున్నారు. ఆయన పేరును హైకోర్టు ఆఫ్ జ్యుడికేచర్ ఎట్ హైదరాబాద్ (ఉమ్మడి హైకోర్టు) ప్రధాన న్యాయమూర్తి పదవికి సిఫారసు చేస్తూ బుధవారం సుప్రీంకోర్టు కొలీజియం నిర్ణయించింది. ఈ మేరకు కేంద్ర న్యాయశాఖకు వర్తమానం పంపింది. త్వరలోనే ఉమ్మడి హైకోర్టు సీజేగా జస్టిస్ టీబీ రాధాకృష్ణన్ నియామకానికి రాష్ట్రపతి ఆమోదముద్ర వేసే అవకాశం ఉంది.

ప్రస్తుతం జస్టిస్ రాధాకృష్ణన్ ఛత్తీస్‌గఢ్ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. ఆయన ఉమ్మడి హైకోర్టు సీజేగా బాధ్యతలు చేపడితే 2015 మే 7 తర్వాత ఉమ్మడి హైకోర్టు పూర్తిస్థాయి ప్రధాన న్యాయమూర్తి పదవి చేపట్టిన తొలివ్యక్తి అవుతారు. 2015 మే 7న అప్పటి ఉమ్మడి హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ కల్యాణ్‌జ్యోతిసేన్ గుప్తా పదవీ విరమణ అనంతరం 33 నెలలుగా పూర్తిస్థాయి ప్రధాన న్యాయమూర్తిని నియమించలేదు. జస్టిస్ కల్యాణ్‌జ్యోతి సేన్‌గుప్తా ఆనంతరం తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తిగా జస్టిస్ దిలీప్ బీ భోసలే, తదనంతరం జస్టిస్ రమేశ్ రంగనాథన్ తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తిగా కొనసాగుతున్నారు. 

ఉమ్మడి హైకోర్టుకు పూర్తిస్థాయి ప్రధాన న్యాయమూర్తిని నియమించకపోవడంతో ఉమ్మడి హైకోర్టులో పరిపాలనపరమైన సమస్యలు తలెత్తుతున్నాయని, అదేవిధంగా న్యాయమూర్తులను నియమించే విషయంలో జాప్యం జరుగుతున్నదని ఇటీవలే సుప్రీంకోర్టులో వ్యాజ్యం దాఖలైంది. దేశంలోని పలు హైకోర్టులకు ప్రధాన న్యాయమూర్తులు, సుప్రీంకోర్టు న్యాయమూర్తుల నియామకం కోసం బుధవారం సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ దీపక్ మిశ్రా నేతృత్వంలోని సీనియర్ న్యాయమూర్తుల కొలీజియం సమావేశమై పలు కీలకనిర్ణయాలు తీసుకున్నది. సుప్రీంకోర్టుకు ఇద్దరు న్యాయమూర్తులతోపాటు హైదరాబాద్ హైకోర్టు (ఉమ్మడి హైకోర్టు)తోపాటు మొత్తం ఐదురాష్ర్టాలకు పూర్తిస్థాయి ప్రధాన న్యాయమూర్తుల నియామకాలకు సిఫారసు చేసింది. ఈ సిఫారసులను కేంద్ర న్యాయశాఖకు పంపించారు. త్వరలోనే రాష్ట్రపతి ఈ నియామకాలకు ఆమోదముద్ర వేసే అవకాశం ఉంది.