వైవిధ్య భారత్‌కు ప్రతీకగా పతంగుల పండుగ

వైవిధ్య భారత్‌కు ప్రతీకగా పతంగుల పండుగ

 హైదరాబాద్ : దేశ, విదేశీ ప్రజలు పెద్ద సంఖ్యలో తరలివచ్చి హైదరాబాద్ కైట్ అండ్ స్వీట్ ఫెస్టివల్‌లో పాల్గొనడం సంతోషంగా ఉన్నదని, ఈ వేడుక మన దేశ వైవిధ్యానికి ప్రతిబింబంగా నిలిచిందని ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు పేర్కొన్నారు. సంప్రదాయ పండుగలను ప్రోత్సహించడం ద్వారా మన సంస్కృతిని కాపాడేందుకు సీఎం కేసీఆర్ కృషిచేస్తున్నారని అభినందించారు. మన పండుగలు ఐకమత్యానికి ప్రతీకలని, సామాజిక సంబంధాలను మెరుగుపరుస్తాయని చెప్పారు. సికింద్రాబాద్‌లోని పరేడ్ గ్రౌం డ్‌లో మూడురోజులపాటు కొనసాగే ఇంటర్నేషనల్ కైట్ అండ్ స్వీట్ ఫెస్టివల్‌ను ఆదివారం ఆయన ప్రారంభించారు. ప్రజలందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు తెలిపారు. అందరి జీవితాల్లో కొత్త కాంతులు నిండాలని ఆకాంక్షించారు. కైట్ ఫెస్టివల్ నాలుగో వార్షికోత్సవం జరుపుకోవడం సంతోషంగా ఉన్నదన్నారు. 


మనం ఎంత ఎత్తుకు ఎదిగినా మూలం నేలమీదే ఉందని పతంగులు గుర్తుచేస్తాయన్నారు. భారతీయ సంస్కృతిలో ప్రతి పండుగకు ఒక అర్థం ఉంటుందని, కుటుంబసభ్యులు, బంధుమిత్రులు ఒకేచోటుకు చేరుకొని సం తోషంగా గడుపుతారని చెప్పారు. భారతీయ సంస్కృతిని, జీవన పద్ధతులను, మన ఆహార అలవాట్లను నేటి తరం అవగాహన చేసుకోవాలని, వాటి పునర్జీవానికి కృషిచేయాలని కోరారు. పాశ్చాత్య సంస్కృతిని వీడి మన మూలాలకు తరలివెళ్దామని పిలుపునిచ్చారు. అందరూ ఆరోగ్యంగా జీవించాలని, చేదు, తీపి.. ఇలా అన్ని రుచులను అనుభవించాలని సూచించారు. క్రీడలు మన ఆరోగ్యాన్ని, సహనాన్ని పెంచుతాయని చెప్పారు. పతంగులు ఎగురవేయడం ద్వారా మానసిక ఆరోగ్యం పెరుగుతుందన్నారు. ఐకమత్యానికి నిదర్శనంగా నిలిచే ఇలాంటి వేడుకలను ప్రభుత్వాలు ప్రోత్సహించాలని సూచించారు.

నలుడు, భీముడు మొదలుకొని భారతీయుల్లో పాకశాస్త్ర ప్రవీణులు ఎంతో మంది ఉన్నారని, మన దేశంలో ఎన్నో ప్రామాణిక శాస్త్రాలు పుట్టాయని గుర్తుచేశారు. అన్ని రకాల వంటల గురించి, అవి తినడం వల్ల కలిగే లాభాల గురించి సుకేశ ముని రచించిన సూప శాస్త్రం గురించి ప్రస్తావించారు. మన ఆహార అలవాట్లను, సంప్రదాయాలను వదిలి పాశ్చాత్య సంస్కృతి వైపు పరుగులెత్తడం మంచి పద్ధతి కాదని హితవుపలికారు. అంతర్జాతీయంగా వివిధ దేశాల వారికి మన తీపి రుచులను పరిచయం చేస్తూ అంతర్జాతీయ స్వీట్స్ ఫెస్టివల్‌ను నిర్వహించడం అద్భుతమని ప్రశంసించారు. ఓవైపు కైట్స్, మరోవైపు స్వీట్స్.. ఇదో అరుదైన కాంబినేషన్ అని చెప్పారు.