విజయవంతంగా నింగిలోకి పీఎస్‌ఎల్‌వీ సి-40

విజయవంతంగా నింగిలోకి పీఎస్‌ఎల్‌వీ సి-40

  శ్రీహరికోట: శ్రీహరికోటలోని సతీష్ ధావన్ అంతరిక్ష కేంద్రం(షార్) నుంచి ప్రయోగించిన పీఎస్‌ఎల్‌వీ సి-40 రాకెట్ విజయవంతంగా నింగిలోకి దూసుకెళ్లింది. గురువారం ఉదయం 5.29 గంటలకు ప్రారంభమైన కౌంట్‌డౌన్ 28 గంటల పాటు కొనసాగి ఈ ఉదయం 9.29 గంటలకు నింగిలోకి దూసుకెళ్లింది. రెండు కక్ష్యలలోకి ఉపగ్రహాలను ప్రవేశపెట్టేందుకు మొత్తం 2 గంటల 21 నిమిషాల సమయం పట్టనుంది. 

ఈ ప్రయోగం ద్వారా ఇస్రో చేపట్టిన 100వ ఉపగ్రహంతో పాటు మరో ఆరు దేశాలకు చెందిన మొత్తం 31 ఉపగ్రహాలను పీఎస్‌ఎల్‌వీ నింగిలోకి మోసుకెళ్లింది. 710 కిలోల బరువున్న స్వదేశీ వందో ఉపగ్రహం కార్టోశాట్-2ను శాస్త్రవేత్తలు ధ్రువ సూర్య అనువర్తిత కక్ష్యలోకి ప్రవేశపెట్టనున్నారు. కార్టోశాట్‌తో పాటు దేశీయ ఉపగ్రహాలైన మైక్రోశాటిలైట్, నానో శాటిలైట్ లు నింగిలోకి ప్రవేశించనున్నాయి. దీంతో పాటు కెనడా, ఫిన్‌ల్యాండ్, ఫ్రాన్స్, కొరియా, యూకే, యూఎస్‌ఏకు చెందిన 28 ఉపగ్రహాలను(613 కిలోల బరువు) శాస్ర్తవేత్తలు కక్ష్యలోకి ప్రవేశపెట్టనున్నారు. 


ఇటువంటి ప్రయోగం అత్యంత అరుదైనదని శాస్త్రవేత్తలు పేర్కొన్నారు. 359 కిలోమీటర్ల భూ స్థిర కక్ష్యలో ఒక ఉపగ్రహాన్ని అదేవిధంగా 550 కిలోమీటర్ల కక్ష్యలో 30 ఉపగ్రహాలను పీఎస్‌ఎల్‌వీ ప్రవేశపెట్టనుంది. మల్టిపుల్ బర్న్ టెక్నాలజీ ద్వారా శాస్త్రవేత్తలు ఈ ప్రయోగాన్ని చేపట్టారు. ఈ ప్రక్రియలో శాటిలైట్ ఎత్తును నియంత్రించేందుకు రాకెట్ ఇంజిన్‌ను ఆఫ్ అండ్ ఆన్ చేస్తారు. ఇస్రో ఛైర్మన్ ఏఎస్ కిరణ్ కుమార్, వీఎస్‌ఎస్‌సీ డైరెక్టర్ కె. శివన్, ఎల్‌పీఎస్‌సీ డైరెక్టర్ సోమనాథ్, ఎస్‌డీఎస్‌సీ డైరెక్టర్ క్రిష్ణన్, ఐఎస్‌ఏసీ డైరెక్టర్ అన్నాదురై, ఎస్‌ఏసీ డైరెక్టర్ తపన్ మిశ్రా మిషన్ కంట్రోల్‌కు చేరుకుని ప్రయోగాన్ని పర్యవేక్షిస్తున్నారు.