యువత చేతుల్లోనే భవిష్యత్తు

యువత చేతుల్లోనే భవిష్యత్తు

  హైదరాబాద్ : సుస్థిర అభివృద్ధి లక్ష్యాల సాధనలో యువత బాధ్యతను గుర్తుచేస్తూ తెలంగాణ జాగృతి ప్రారంభించిన బృహత్ప్రయత్నం సఫలీకృతమైంది. భవిష్యత్తు అంతా యువతచేతుల్లోనే ఉన్నదని.. బాధ్యతగా వ్యవహరించి గాంధేయమార్గంలో అభివృద్ధి సాధన దిశగా యువత వేయాల్సిన అడుగులను గుర్తుచేస్తూ మూడు రోజులపాటు కొనసాగిన అంతర్జాతీయ సదస్సు ప్రపంచ దేశాల ప్రతినిధుల ప్రశంసలు అందుకొన్నది. తెలంగాణ జాగృతి వ్యవస్థాపక అధ్యక్షురాలు, నిజామాబాద్ ఎంపీ కవిత చేస్తున్న కృషిని అన్ని రంగాల ప్రముఖులు అభినందించారు. 135 దేశాల నుంచి వచ్చిన 550 మంది ప్రతినిధులు వివిధ రంగాలకు సంబంధించి పలు కీలకాంశాలపై లోతైన చర్చలో పాల్గొనడం విశేషం. పలు సెషన్స్‌లో జరిగిన ప్యానెల్ చర్చల్లో జాతీయ, అంతర్జాతీయ ప్రముఖులు యువతకు మార్గనిర్దేశం చేశారు. సుస్థిరాభివృద్ధి సాధించాలంటే ఏ ఒక్కరి వల్ల కాదని, ప్రపంచవ్యాప్తంగా ఉన్న యువత దీనిపై ఆలోచించి ఏకతాటిపైకి రావాలని సూచించారు.

గాంధేయ మార్గంలో సుస్థిరాభివృద్ధి లక్ష్యాల సాధన- యువత పాత్ర అన్నది సదస్సు నినాదంగానే మిగిలిపోకుండా ఆ లక్ష్యాన్ని సాధించేందుకు యువత నడుం బిగించాలని సదస్సు పిలుపునిచ్చింది. మూడురోజుల పాటు వేర్వేరు వేదికలపై ప్రత్యేకంగా వర్క్‌షాప్‌లు నిర్వహించారు. జాగృతి గురించి తెలిపేలా ఏర్పాటుచేసిన స్టాళ్లు ఆకర్షణగా నిలిచాయి. స్వదేశీ, విదేశీ ప్రతినిధులకు జాగృతి కార్యక్రమాల గురించి వలంటీర్లు వివరించారు. కార్యక్రమ నిర్వహణపై ప్రతినిధులు సంతోషం వ్యక్తంచేశారు. యువత బాధ్యతను గుర్తుచేసేలా ఇలాంటి కార్యక్రమాలు మరిన్ని నిర్వహించాల్సిన అవసరం ఉందన్నారు. జాగృతి చేస్తున్న ప్రయత్నానికి మద్దతుగా నిలుస్తామని చెప్పారు. సదస్సు ఆశించిన దానికంటే విజయవంతం కావడంపట్ల జాగృతి వ్యవస్థాపక అధ్యక్షురాలు, ఎంపీ కవిత సంతోషం వ్యక్తంచేశారు. రెండేండ్లకు ఒకసారి ఇలాంటి సదస్సులు నిర్వహిస్తామన్నారు.