ఫీడింగ్‌ బాటిల్స్‌ వాడుతున్నారా?

ఫీడింగ్‌ బాటిల్స్‌ వాడుతున్నారా?

  పిల్లలకు ఫీడింగ్‌ బాటిల్స్‌ ఉపయోగించవద్దని పిల్లల నిపుణులు చెబుతున్నారు. రకరకాల ఫీడింగ్‌ బాటిల్స్‌ వాడడం వల్ల పెదవులు, దంతాలు, నోటి అమరికలో అనూహ్య మార్పులు చోటు చేసుకుంటున్నాయని వారు సూచిస్తున్నారు. కారణాలేంటో తెలుసుకుందాం! రబ్బర్‌లోని కంటికి కనిపించని క్రిముల వలన పిల్లలకు అనారోగ్య సమస్యలు ఏర్పడతాయి. అందుకే పిల్లలకు తల్లి పాలే ఆరోగ్యదాయకం. అదే ఫీడింగ్‌ బాటిల్స్‌ ద్వారా పాలను ఇచ్చేటప్పుడు నాలుక మడత పడుతుంది. తాగిన తర్వాత శ్వాస తీసుకోవడం పిల్లలకు కష్టమవుతుంది. మదర్‌ ఫీడ్‌, కప్పుల్లో పాలు తాగే పిల్లల కంటే ఫీడింగ్‌ బాటిల్స్‌ ద్వారా పాలు తాగే పిల్లల్లో శ్వాసకోశ సమస్యలు ఉత్పన్నమవుతున్నాయని అధ్యయనాలు చెబుతున్నాయి.

ఫీడింగ్‌ బాటిల్స్‌ ద్వారా తాగితే పాలతో పాటు గాలి కూడా కడుపులోకి చేరుతుంది. దానివల్ల గ్యాస్ట్రిక్‌, కడుపుబ్బరం వంటి సమస్యలు ఏర్పడతాయి. బాటిల్‌ పాలు తాగే పిల్లలు మదర్‌ ఫీడ్‌కు దూరమవుతారు. ఫీడింగ్‌ బాటిల్‌ ద్వారా పాలు తాగితే.. దవడ, దంత సమస్యలు కూడా ఏర్పడతాయి. అలాగే మాటలు సకాలంలో రావు. ఉచ్ఛారణ సరిగ్గా ఉండదు. దంత వరుసలో మార్పులుంటాయి. ఫీడింగ్‌ బాటిల్స్‌ అధికంగా ఉపయోగిస్తే.. డయేరియా వంటి సమస్యలూ ఏర్పడతాయని పిల్లల వైద్యనిపుణులు అంటున్నారు. అందుకే పాల బుడ్డీల కంటే గ్లాసుల ద్వారా పిల్లలకు పాలు పట్టించడం మంచిదని నిపుణులు సూచిస్తున్నారు. అందుకే పిల్లలకు పాలు పట్టించే విషయంలో జాగ్రత్తలు తీసుకోవాలి.