మాన్‌సూన్‌లో చర్మ సౌందర్యం

మాన్‌సూన్‌లో చర్మ సౌందర్యం

 వాతావరణ మార్పు ప్రభావం చర్మ సౌందర్యంపై ఎక్కువగా ఉంటుంది. ఎండ కొట్టినా.. చలి తాకినా.. వర్షం పడ్డా మార్పు స్పష్టంగా కనిపిస్తుంది. మాన్‌సూన్ సీజన్ వచ్చేస్తుంది. వర్షంలో తడవడమనే కాకుండా మాన్‌సూన్‌లో ఏర్పడే మార్పుల వల్ల కూడా చర్మం సహజ రీతుల్ని కోల్పోయే ప్రమాదముంది. సీజన్‌కు తగ్గట్టుగా సరైన జాగ్రత్తలు తీసుకుంటే చర్మ సౌందర్యాన్ని కాపాడుకోవచ్చు. 


అలోవెరా జెల్: ఇది చర్మానికి దివ్య ఔషధంలా పనిచేస్తుంది. వర్షాకాలంలో వచ్చే చర్మ సమస్యలకు ఇదో అద్భుతమైన విరుగుడు. చర్మంలోని రక్త కణాలను కూడా శుభ్రం చేసే శక్తి అలోవెరాకు ఉంది. చర్మంపై ఉన్న మొటిమలు, ముడతలను కూడా ఇది నివారిస్తుంది. కాబట్టి మాన్‌సూన్ సీజన్‌లో బయటకు వెళ్లినప్పుడల్లా అలోవెరా జెల్‌ను ముఖానికి రాసుకోవడం ఉత్తమం.

యాంటీ ఫంగల్ పౌడర్: వర్షాకాలంలో తరుచూ వేధించే మరో సమస్య ఫంగస్. శుభ్రత లోపించినా.. అపరిశుభ్రమైన వాతావరణంలోకి వెళ్లినా ఫంగస్ దాడిచేస్తుంది. వీటి బారినుంచి తప్పించుకోవాలంటే యాంటీ ఫంగల్ పౌడర్‌ను అద్దుకుంటే చాలు. చర్మ సమస్యల బారిన పడకుండా సురక్షితంగా ఉండొచ్చు. 

టిట్రీ ఆయిల్: తేయాకు నూనె, కొబ్బరి నూనెల మిశ్రమంతో ఈ నూనెను తయారుచేస్తారు. ఇది చర్మానికి చాలా మేలు చేస్తుంది. ఈ మిశ్రమంలో ఉండే తేయాకు నూనె క్రిమిసంహారినిగా పనిచేస్తుంది. చిన్న పగుళ్లు, దద్దుర్లు, మొటిమలు వంటి వాటి నుంచి ఉపశమనం కలిగిస్తుంది. దీనిని రెగ్యలర్‌గా చర్మానికి పట్టిస్తే మంచి ఫలితం ఉంటుంది. 

తేనె: సహజసిద్ధమైన సౌందర్యాన్ని మెరుగుపరచుకోవాలంటే ప్రకృతి సిద్ధమైన తేనె శ్రేయస్కరం. పొడి చర్మానికి చక్కటి మందలు పనిచేస్తుంది. బ్రౌన్‌షుగర్, తేనె, ఆలివ్, నిమ్మరసంను మిశ్రమంగా చేసుకుని ముఖానికి మాస్క్‌లా వేసుకుంటే చర్మం నిగారింపుగా తయారవుతుంది.