ఆగలేక ముద్దు పెట్టాడు.. పదవి పోయింది

ఆగలేక ముద్దు పెట్టాడు.. పదవి పోయింది

  న్యూయార్క్‌ : సాధరణ పౌరులేమోగానీ నాయకులు మాత్రం ఒళ్లు దగ్గర పెట్టుకొని ఉండాలి. అలా కాకుండా అతి చేయాలని చూస్తే మొదటికే మోసం వస్తుంది.. పదవి పోయి తీరుతుంది. అమెరికాలో ఓ సెనేటర్‌ పరిస్థితి అంతే అయింది. ఓ బార్‌కు వెళ్లిన షెల్‌ రాక్‌ లోవా సెనేటర్‌ బిల్‌ డిక్స్‌ ఓ లాబీయిస్ట్‌ మహిళకు అందరి ముందే గాటు ముద్దు పెట్టాడు. ఆ దృశ్యాన్ని వీడియో తీసిన కొంతమంది ఆన్‌లైన్‌లో పెట్టడంతో అది కాస్త వైరల్‌ అయింది. బాధ్యత గల వ్యక్తి ఇలాగేనా ప్రవర్తించేదంటూ తీవ్ర స్థాయి దుమారం రేపింది. దాదాపు 52 నిమిషాలపాటు ఉన్న ఆ వీడియోను లిబరల్‌ న్యూస్‌ వెబ్‌సైట్‌ పోస్ట్‌ చేసింది. ఆ వీడియోలో చూపిన ప్రకారం బార్‌లో ఉండే స్లూల్స్‌పై డిక్స్‌ మరో మహిళతో కూర్చొని ఉన్నాడు.

దర్జాగా మందుకొడుతూ రెచ్చిపోయి ఆమెను గాఢంగా చుంబించాడు. అయితే, ఆ మహిళ వివరాలు మాత్రం బయటపెట్టకుండా ఆమె ఒక లాబీయిస్ట్‌ అంటూ సదరు న్యూస్‌ సంస్థ తెలిపింది. పలు మున్సిపాలిటీ గ్రూపులకు ఆమె లాబీయిస్టుగా పనిచేస్తారని వెల్లడించింది. ఈ ఘటన ఇదే నెల (మార్చి) 1న చోటు చేసుకుంది. దీంతో లోవా సెనేట్‌ ప్రెసిడెంట్‌ జాక్‌ వైట్‌వర్‌ ఓ కీలక ప్రకటన చేశారు. మార్చి 12 అర్ధరాత్రి 2గంటల నుంచి డిక్స్‌ సెనేటర్‌ బాధ్యతలకు ముగింపు అని వెల్లడించారు. డిక్స్‌ తన కుటుంబంలో మూడో తరం రైతు. బట్లర్‌, గ్రండి, హార్డిన్‌, ఇతర జిల్లాల్లో తన వ్యవసాయ కార్యకలాపాలు చూసుకునేవారు. పదేళ్లపాటు లోవా హౌస్‌లో పనిచేశారు. 2010 నుంచి వరుసగా సెనేటర్‌గా ఎంపికవుతూ వస్తున్నాడు. అయితే, ఈ ఘటనపై డిక్స్‌ వ్యక్తిగతంగా ఒక్క ప్రకటన కూడా చేయలేదు. అతడి పూర్తి వివరాలను అప్పుడే లోవా సెనేట్‌ రిపబ్లికన్స్‌ వెబ్‌సైట్‌ నుంచి కూడా తొలగించారు.