అబార్షన్‌ చట్టబద్ధతకు అర్జెంటీనా సెనేట్‌ నో!

అబార్షన్‌ చట్టబద్ధతకు అర్జెంటీనా సెనేట్‌ నో!

  బ్యూనస్‌ ఐర్స్‌: గర్భస్రావానికి చట్టబద్ధత కల్పించే బిల్లును అర్జెంటీనా సెనేట్‌ మెజార్టీ ఓటుతో తిరస్కరించింది. 14 వారాలలోపు గర్భస్థ శిశువును తొలగించే అంశానికి చట్టబద్ధత కల్పించాలంటూ ప్రవేశపెట్టిన ఈ బిల్లుపై అర్జెంటీనా సెనేట్‌లో దాదాపు 15 గంటలకు పైగా సుదీర్ఘ చర్చ జరిగింది. అనంతరం జరిగిన ఓటింగ్‌లో 31 మంది అనుకూలంగా, 38 మంది వ్యతిరేకంగా ఓటు వేయటంతో బిల్లు వీగిపోయింది. అయితే ఈ బిల్లుకు గట్టి ప్రజా మద్దతు వున్నట్లు తాజా ఒపీనియన్‌ పోల్స్‌ చెబుతున్నాయి. కేథలిక్‌ చర్చ్‌ వత్తిడితోనే అర్జెంటీనా సెనేట్‌ ఈ బిల్లును తిరస్కరించిందని దీనిని సమర్ధిస్తున్న మహిళా ఉద్యమ కార్యకర్తలు ఆరోపిస్తున్నారు. అర్జెంటీనా పోప్‌ ఫ్రాన్సిస్‌ మాతృదేశం అన్న విషయం తెలిసిందే. ఈ బిల్లుకు దిగువసభ ఇప్పటికే ఆమోదముద్ర వేయటంతో దీనిపై సంతకం చేసి చట్టబద్ధత కల్పించేందుకు అధ్యక్షుడు మార్షియో మాక్రి కూడా సంసిద్ధత వ్యక్తం చేశారు. ఈ బిల్లును సెనేట్‌ తిరస్కరించటంతో అత్యాచార బాధితుల విషయంలోనూ, మహిళకు ప్రాణాపాయం ఉన్న సందర్భాలలో మాత్రమే గర్భస్రావానికి చట్టబద్ధత లభిస్తుంది.