అధిక వేతనాల కోసం హంగరీ

అధిక వేతనాల కోసం హంగరీ

 బుడాపెస్ట్‌ : హంగరీలోని జియర్‌లో గల 'ఆడి' ఆటోమొబైల్‌ కర్మాగారంలో కార్మికులు అధిక వేతనాలు, ఇతర ఆర్థిక ప్రయోజనాల కోసం సమ్మె చేస్తున్నారు. శుక్రవారం వారు సమ్మె నోటీసు ఇచ్చి, తొలుత రెండు గంటల పాటు పనులను నిలుపుచేశారు. ఆడి హంగేరియా ఇండిపెండెంట్‌ ట్రేడ్‌ యూనియన్‌ (ఎహెచ్‌ఎఫ్‌ఎస్‌జెడ్‌) ఈ సమ్మెకు పిలుపిచ్చింది. జియర్‌ ప్లాంట్‌లో 11,500మంది కార్మికులు పనిచేస్తున్నారు. కార్మికుల మౌలిక వేతనాలను 18శాతం పెంచాలని ఈ జర్మనీ సంస్థను యూనియన్‌ డిమాండ్‌ చేసింది. ప్రతీ ఉద్యోగికి నెలకు వారాంతపు శలవు ఇవ్వాలని కోరింది. 

ఉద్యోగి ప్రయోజనాలను 620,000 హెచ్‌యుఎఫ్‌ల నుండి 787,000 హెచ్‌యుఎఫ్‌లకు పెంచాలని కోరింది. వీటికి తోడు బోనస్‌ను పెంచాలని కూడా డిమాండ్‌ చేసింది. ఈ ప్రాంతంలో ఆడి సంస్థకు చెందిన హంగరీ ఉద్యోగులే బాగా తక్కువగా వేతనాలు పొందుతున్నారని కార్మిక సంఘం జరిపిన సర్వేలో వెల్లడైంది. స్లోవేకియాలో ఆడి కార్మికులు ఇక్కడ వారికన్నా 28శాతం ఎక్కువ వేతనాలు పొందుతున్నారు. చెక్‌ రిపబ్లిక్‌లో 25శాతం ఎక్కువ పొందుతున్నారు. పోలెండ్‌లో అయితే ఈ తేడా ఏకంగా 39శాతం వరకు వుంది. బెల్జియన్‌ కార్మికులకైతే జియర్‌ కార్మికుల వేతనాలు కన్నా 3.6రెట్లు ఎక్కువ లభిస్తున్నాయి.