అదృశ్యం కానున్న అతిపెద్ద మంచుఖండం

అదృశ్యం కానున్న అతిపెద్ద మంచుఖండం

 వాషింగ్టన్‌ : ప్రపంచంలోనే అతిపెద్ద మంచు ఖండం దాదాపు 18ఏళ్ళ సుదీర్ఘ ప్రయాణం తర్వాత కనుమరుగు కానుందని నాసా తెలిపింది. 2000 సంవత్సరం మే నెల్లో అంటార్కిటికా రాస్‌ ఐస్‌ షెల్ఫ్‌ నుండి ఈ ఖండం విడిపోయింది. బి-15గా పిలిచే ఈ మంచు ఖండం విడిపోయినపుడు దీని పొడవు 296కిలోమీటర్లు, వెడల్పు 37కిలోమీటర్లు. అప్పటినుండి నెమ్మదిగా పయనిస్తూ, చిన్న చిన్న ముక్కలుగా విడిపోతూ, చాలావరకు కరిగిపోతూ ముందుకు సాగింది.

కేవలం నాలుగే ముక్కలు మిగిలాయి. అందులో ఒక ముక్క పొడవు 37కిలోమీటర్లు వుందని అమెరికా నేషనల్‌ ఐస్‌ సెంటర్‌ కనుగొంది. అంతర్జాతీయ రోదసీ స్టేషన్‌ (ఐఎస్‌ఎస్‌)లోని వ్యోమగాములు గత నెల 22వ తేదీన బి-15జెడ్‌ మంచు ఖండం ఫోటో తీశారు. దాని పొడవు 18కిలోమీటర్లు, వెడల్పు 9కిలోమీటర్లు వుంది. ఇంకా చిన్న చిన్న ముక్కలుగా విడిపోతే కనుగొనడం కూడా కష్టమవుతుందని నాసా ప్రకటన తెలిపింది. గత నెల్లో తీసిన ఫోటోల ఆధారంగా చూస్తే దక్షిణ జార్జియా దీవులకు వాయవ్యంగా 277కిలోమీటర్ల దూరంలో ఈ మంచు ఖండం వున్నట్లు వెల్లడైంది.