ఆఫ్ఘన్‌ ప్రభుత్వ భవనంపై ఉగ్రవాదుల దాడి

ఆఫ్ఘన్‌ ప్రభుత్వ భవనంపై ఉగ్రవాదుల దాడి

  జలాలాబాద్‌: అఫ్ఘనిస్థాన్‌లోని జలాలాబాద్‌ ప్రావిన్స్‌లోని ఓ ప్రభుత్వ భవనంపై ఉగ్రవాదులు మెరుపుదాడికి పాల్పడ్డారు. ఈ భవనంలోకి చొరబడిన ఉగ్రవాదులు అందులోని ఉద్యోగులను, ప్రజలను బందీలుగా మల్చుకున్నారు. ఈ ఘటనలో 10 మంది మృతి చెందగా, మరో 10 మంది తీవ్రంగా గాయపడ్డారు. క్షతగాత్రులను ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. నన్‌గార్హార్‌ ప్రావిన్షియల్‌ గవర్నర్‌ అధికార ప్రతినిధి అత్తాహుల్లా ఖోగ్యానీ తెలిపిన వివరాల ప్రకారం....జలాలాబాద్‌లోని ప్రభుత్వ బిల్డింగ్‌లో ఉగ్రవాదులు చొరబడి బీభత్సం సృష్టించారు. భవనంలో రెండు బాంబులు పేల్చారు. కాల్పులకు తెగబడ్డారు. ఈ ఘటనలో 10 మంది చనిపోయారు. 

సమచారం అందుకున్న అఫ్ఘాన్‌ బలగాలు రంగంలోకి దిగాయి. ప్రభుత్వ భవనాన్ని చుట్టుముట్టాయి. పరిసర ప్రాంతాలను తమ ఆధీనంలోకి తీసుకున్నాయి. అఫ్ఘాన్‌ బలగాలకు, ఉగ్రవాదులకు మధ్య జరిగిన ఎదురుకాల్పుల్లో 11మంది మృతి చెందగా.. మరో 10మంది గాయపడ్డారు. గాయపడిన వారిలో పిల్లలు కూడా ఉన్నట్టు సమాచారం. ప్రస్తుతం ఆపరేషన్‌ కొనసాగుతోంది. భవనంలో 50 మంది ఉగ్రవాదులు చొరబడినట్టు ప్రత్యక్ష సాక్షులు చెబుతున్నారు. అఫ్ఘాన్‌ బలగాలు నిర్వహించిన ప్రత్యేక ఆపరేషన్‌లో ఇద్దరు ఉగ్రవాదులు హతమయ్యారు. వీరిలో ఒకరు తనను తాను పేల్చుకొని మరణించగా, మరొకరిని భద్రతా దళాలు కాల్చి చంపాయి.

ఈ ఘటనకు బాధ్యత వహిస్తున్నట్టు ఏ ఉగ్రసంస్థ కూడా ప్రకటించుకోలేదు. తాలిబన్లకు, అఫ్ఘాన్‌ బలగాలకు మధ్య హోరాహోరిగా ఎదురుకాల్పులు జరుగుతున్నాయి. ఇదిలా ఉండగా, జలాలాబాద్‌లో తాలిబన్లు బీభత్సం సృష్టిస్తున్నారు. రెండు వారాల్లో మూడు దాడులకు పాల్పడ్డారు. జులై1న తాలిబన్లు జరిపిన దాడిలో 19 మంది మృతిచెందారు. ఈనెల 10న జరిపిన దాడిలో 12 మంది మృతి చెందారు. అఫ్ఘనిస్థాన్‌లో తాలిబన్లు, మిలిటెంట్ల దాడులు పెరిగిపోయాయి. 2016, జనవరి నుంచి ఈఏడాది జులై 11నాటికి 144 దాడులు జరిగాయి. ఈ దాడుల్లో 2,359 మంది మృతిచెందగా, 3,802 మంది మృతి చెందారని అఫ్ఘాన్‌ రక్షణ శాఖ పేర్కొంది.