ఆఫ్ఘనిస్తాన్‌లో ఆత్మాహుతి దాడి

 ఆఫ్ఘనిస్తాన్‌లో ఆత్మాహుతి దాడి

ఆఫ్ఘనిస్తాన్‌లో ఆత్మాహుతి దాడి

 కాబూల్‌: ఆఫ్ఘనిస్తాన్‌లో మంగళవారం జరిగిన ఆత్మాహుతి దాడిలో దాదాపు 22 మంది మరణించగా అనేక మందికి గాయాలు తగిలాయని అధికారులు చెప్పారు. ఆఫ్ఘనిస్తాన్‌ తూర్పు ప్రాంతంలో వున్న జలాలాబాద్‌ నగరానికి, పక్కనే వున్న పాకిస్తాన్‌ సరిహద్దు ప్రాంతంలో ఈ దాడి జరిగింది. గత వారం కాబూల్‌లో 20 మందికి పైగా బలిగొన్న ఆత్మాహుతి దాడి కన్నా ఇది చిన్నదే అయినప్పటికీ ఈ దాడి అనంతరం దేశవ్యాప్తంగా హింసాకాండ చెలరేగింది. అయితే ఈ దాడికి తామే బాధ్యత వహిస్తున్నట్లు ఇప్పటి వరకూ ఏ మిలిటెంట్‌ సంస్థా ప్రకటించలేదని ప్రావిన్షియల్‌ గవర్నర్‌ కార్యాలయం వెల్లడించింది.

దాడి అనంతరం కనీసం 30కి పైగా మృతదేహాలను ఆస్పత్రికి తరలించారని, ఈ సంఖ్య మరింత పెరిగే అవకాశం వుందని నంగర్‌హర్‌ ప్రావిన్షియల్‌ కౌన్సిల్‌ సభ్యుడు సోహ్రబ్‌ ఖాద్రి చెప్పారు. పదిహేడేళ్లుగా అంతర్యుద్ధంతో సతమతమవుతున్న ఆఫ్ఘనిస్తాన్‌లో శాంతి చర్చల కోసం కొనసాగుతున్న సన్నాహాలపై తాజా దాడి, అనంతర హింసాకాండ నీళ్లు చల్లాయని అధికారులు ఆవేదన వ్యక్తం చేశారు. అయితే గత జులైలో అమెరికాతో జరిగిన భేటీ తరువాత మరో భేటీ కోసం తాము సిద్ధమవుతున్నట్లు ఇద్దరు తాలిబన్‌ నేతలు చెప్పారు. ఆత్మాహుతి దాడి అనంతరం జలాలాబాద్‌, పరిసర ప్రాంతాలు లక్ష్యంగా చిన్న చిన్న పేలుళ్లు జరిగియని, అందులో ఒక వ్యక్తి మరణించగా మరో ముగ్గురు గాయపడ్డారని అధికారులు చెప్పారు.