ఐరాసకు గైర్హాజరు కానున్న సూకీ

ఐరాసకు గైర్హాజరు కానున్న సూకీ

 యాంగాన్‌: ప్రస్తుతం మయన్మార్‌ను కుదిపేస్తున్న రోహింగ్యాల సంక్షోభం నేపథ్యంలో త్వరలో జరుగనున్న ఐరాస జనరల్‌ అసెంబ్లీ సమావేశాలకు ఆ దేశ ప్రభుత్వ సలహాదారు ఆంగ్‌సాన్‌ సూకీ హాజరు కావటం లేదని ఆమె కార్యాలయం ప్రకటించింది. మయన్మార్‌లోని రఖినే రాష్ట్రంలో చెలరేగుతున్న హింసతో దాదాపు 3.7 లక్షల మంది రోహింగ్యాలు పొరుగునే వున్న బంగ్లాదేశ్‌కు వలసబాట పట్టటంతో తీవ్ర సంక్షోభం తలెత్తిన విషయం తెలిసిందే.

రఖినే రాష్ట్రంలో రోహింగ్యా మిలిటెంట్‌ దాడులపై సైన్యం తీవ్రంగా స్పందించటం గత ఏడాది ప్రభుత్వ సలహాదారుగా పదవీబాధ్యతలు చేపట్టిన సూకీకి పెను సమస్యగా మారుతోంది. ఈ హింసాకాండకు అడ్డుకట్ట వేయటంలో విఫలమైన సూకీ నుండి నోబుల్‌ శాంతి పురస్కారాన్ని వాపసు తీసుకోవాలన్న డిమాండ్‌ క్రమంగా పెరుగుతోంది. మయన్మార్‌ ప్రభుత్వ ప్రతినిధిగా గత ఏడాది ఐరాస జనరల్‌ అసెంబ్లీ సమావేశంలో తొలిసారి ప్రసంగించిన సూకీ రోహింగ్యాల పట్ల తమ ప్రభుత్వం వ్యవహరిస్తున్న తీరును గట్టిగా సమర్థించుకున్న విషయం తెలిసిందే.