ఆకర్షిస్తున్న యువరాణి చేతి వేళ్లు.. వైరల్‌

ఆకర్షిస్తున్న యువరాణి చేతి వేళ్లు.. వైరల్‌

  లండన్‌ : ఇంటర్నెట్‌లో ఇప్పుడు ఓ అంశంపై తెగ చర్చ నడుస్తోంది. బ్రిటన్‌ టాబ్లాయిడ్‌లలో, వెబ్‌ సైట్‌లలో ఆ అంశంపై మోతమోగిపోతోంది. ఇక డెయిలీ మెయిల్‌ అయితే ఏకంగా తన ముఖ పేజీలో ఒక స్టోరీనే ప్రచురించింది. ఇంతకీ ఏమిటా అంశం అంటే బ్రిటన్‌ ప్రిన్సెస్‌ కేట్‌ మిడిల్‌టన్‌ చేతివేళ్లు. 'ఎందుకు కేట్‌ వేళ్లు సమానంగా ఉన్నాయి?' అనే హెడ్డింగ్‌తో డెయిలీ మెయిల్‌ పెద్ద కథనం వెలువరించింది. అంతేకాదు ఆమె చేతి వేళ్లను కూడా బాగా దగ్గరిగా చేసి ఛాయాచిత్రంగా ప్రచురించింది.

 గత వారం ఇప్పటికే ఇద్దరు బిడ్డలకు తల్లి అయి ప్రస్తుతం గర్భవతిగా ఉన్న బ్రిటన్‌ యువరాణి కేట్‌ ఆక్స్‌ఫర్డ్‌లోని పిగాసస్‌ ప్రాథమిక పాఠశాలను సందర్శించారు. ఓ చారిటీ సంస్థ పనితీరును అంచనా వేసేందుకు అక్కడికి వెళ్లారు. సాధారణంగానే ఆమెను ఫొటోలు ఎప్పటి మాదిరిగానే తీశారు. అయితే, ఆ ఫొటోలు పరిశీలించిన వారు ఆమె కుడిచేత్తో పర్సును పట్టుకున్న సమయంలో ఆమె చేతి వేళ్లు మూడు సమానంగా కనిపించాయి. ఉంగరపు వేలు కొంచెం చిన్నగా, చూపుడువేలు దానికి కాస్త సమానంగా మధ్య వేలి పొడవుగా అందరికీ ఉంటుంది. అయితే, కేట్‌కు మాత్రం మూడు వేళ్లు సమానంగా ఉన్నట్లు కనిపించాయి. దాంతో ఇదే అంశంపై పెద్ద మొత్తంలో చర్చ మొదలుపెట్టి పుంఖాను పుంఖాలుగా టాబ్లాయిడ్‌లలో రాతలు మొదలుపెట్టారు.