అమెరికా, చైనాలకు పెను తుపానుల ముప్పు

అమెరికా, చైనాలకు పెను తుపానుల ముప్పు

  వాషింగ్టన్‌ : అమెరికా, చైనాల్లో ఒకేసారి పెను తుపానులు సంభవించనున్నాయి. భారీ వర్షాలు, వరదలు, రాకాసి అలలు వచ్చే అవకాశముందని వాతావరణ శాఖ హెచ్చరించడంతో అధికార యంత్రాంగం అప్రమత్తమైంది. అమెరికాలోని కరోలినా ప్రాంతాన్ని 'ఫ్లోరెన్స్‌' తుపాను తాకనుండగా, మరోవైపు హాంకాంగ్‌, దక్షిణ చైనాల దిశగా మంగ్‌హట్‌ తుపాను పయనిస్తోందని వాతావరణ శాఖ తెలిపింది. మంగ్‌హట్‌ తుపానును 'సూపర్‌ టైఫూన్‌'గా వర్గీకరించారు. దీని ధాటికి గంటకు 155మైళ్ళ వేగంతో గాలులు వీస్తాయి. వారాంతానికి దక్షిణ చైనాకు సమీపంగా తుపాను తాకుతుందని, ఫిలిప్పీన్స్‌లో కూడా ఈ తుపాను ప్రభావం చూపిస్తుందని భావిస్తున్నారు. దాదాపు 4.3కోట్ల మంది ప్రజలు మంగ్‌హట్‌ తుపాను బారిన పడతారని ఐక్య రాజ్య సమితి ప్రపంచ విపత్తుల సమన్వయ సంస్థ (జిడిఎసిఎస్‌) అంచనా వేసింది. కాగా, మరోవైపు అట్లాంటిక్‌ సముద్రంలో ఏర్పడిన ఫ్లోరెన్స్‌ తుపాను ఉత్తర కరోలినా దిశగా పయనిస్తోంది. ఈ తుపాను ధాటికి రాకాసి అలలు సంభవిస్తాయని, భారీ వర్షాలు, వరదలు ముంచెత్తుతాయని హెచ్చరిస్తున్నారు. ఉత్తర, దక్షిణ కరోలినా, వర్జీనియా రాష్ట్రాల్లో దాదాపు పది లక్షలమంది ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించేందుకు అధికారులు చర్యలు తీసుకుంటున్నారు.