అమెరికా జోక్యాన్ని తిప్పికొట్టిన వెనిజులా

అమెరికా జోక్యాన్ని తిప్పికొట్టిన వెనిజులా

 కారకస్‌ : అమెరికా జోక్యందారీ విధానాలను వెనిజులా విజయవంతంగా తిప్పికొట్టిందని బొలీవియా అధ్యక్షుడు ఎవో మొరేల్స్‌ వ్యాఖ్యానించారు. కారకస్‌లోని మిలటరీ అకాడమీలో జరిగిన కార్యక్రమంలో పాల్గొన్న మొరేల్స్‌ మాట్లాడుతూ, అమెరికా ఆంక్షలను, జోక్యందారీ ఎత్తుగడలను వెనిజులా ఓడించిందని, ఈ విషయంలో బొలివారియా జాతీయ సాయుధ బలగాలు (ఎఫ్‌ఎఎన్‌బి) పట్ల తనకు గల గౌరవాన్ని వ్యక్తం చేస్తున్నానని, విప్లవ, ప్రగతిశీల శక్తులను అభినందిస్తున్నానని చెప్పారు. వెనిజులాలో సుసంపన్నమైన ఖనిజ వనరులను ఎలాగైనా కైవసం చేసుకోవాలన్న ఉద్దేశ్యంతోనే అమెరికా సైనిక బెదిరింపులకు పాల్పడిందని అన్నారు. ఈ వనరుల పరిరక్షణ కోసం ప్రజలు పోషించిన కీలక పాత్రను ఆయన ప్రశంసించారు. వెనిజులాకు బొలీవియా మద్దతు ఎల్లప్పుడూ వుంటుందని పునరుద్ఘాటించారు. వెనిజులా ఎప్పటికీ ఒంటరి కాదని, తామందరమూ అండగా వుంటామని స్పష్టం చేశారు. క్యూబన్లు 50ఏళ్ళు సాగించిన పోరాటాన్ని ఆయన ఈ సందర్భంగా గుర్తు చేసుకున్నారు. బొలివారియన్‌ యూనివర్శిటీ ఇచ్చిన ప్రతిష్టాత్మకమైన డాక్టరేట్‌ అవార్డును స్వీకరిస్తూ మొరేల్స్‌ మాట్లాడారు.