అమెరికా, రష్యా మధ్య కొత్త ప్రచ్ఛన్న యుద్ధం

అమెరికా, రష్యా మధ్య కొత్త ప్రచ్ఛన్న యుద్ధం

 వాషింగ్టన్‌ : చైనాపై ఇప్పటికే వాణిజ్య యుద్ధాన్ని తీవ్రతరం చేసిన అమెరికా, తాజాగా రష్యాపై కొత్త ఆంక్ష లతో విరుచుకుపడింది. లండన్‌లోని రష్యన్‌ మాజీ దౌత్యవేత్త సెర్గీ స్క్రిపాల్‌, ఆయన కుమార్తెపై విష ప్రయోగానికి రష్యా పాల్పడి నట్లు ఎలాంటి ఆధారాలు లేకున్నా అమెరికా ఏకపక్షంగా రష్యాను శిక్షించేందుకు పూనుకుంది. ఆ దేశంపై కొత్తగా మరో విడత ఆంక్షలు విధించింది. ఈ ఆంక్షలు ఈ నెల 22 నుండి అమలులోకి వస్తాయని అమెరికా విదేశాంగశాఖ ఒక ప్రకటనలో తెలిపింది. అమెరికా చర్య దుర్మార్గం, క్రూరం అని రష్యా వెంటనే ప్రకటించింది. అమెరికా శత్రుపూరిత వైఖరితో తీసుకున్న ఈ చర్యను తాను సహించేది లేదని రష్యన్‌ విదేశాంగా శాఖ ప్రతినిధి స్పష్టం చేశారు. 'అంతర్జాతీయ చట్ట నిబంధనలకు విరుద్ధంగా రష్యన్‌ ఫెడరేషన్‌ ప్రభుత్వం రసాయన, జీవాయుధ వినియోగానికి పాల్పడినందున జీవ రసాయనిక ఆయుధ నియంత్రణ చట్టం (సిబిడబ్ల్యుయాక్ట్‌ 1991) కింద రష్యాపై కొత్తగా ఆంక్షలు విధిస్తున్నట్లు అమెరికా విదేశాంగశాఖ ప్రతినిధి హేదర్‌ చెప్పారు.

స్క్రిపాల్‌, ఆయన కుమార్తెపై జరిగిన ఈ దాడిలో రష్యాకు ఎటువంటి ప్రమేయం లేదని ప్రాథమిక దర్యాప్తులో వెల్లడయినప్పటికీ అమెరికా పదేపదే ఈ ఆరోపణలు చేస్తుండటం గమనార్హం. తాజా ఆంక్షలపై రష్యాకు బుధవారం మధ్యాహ్నమే సమాచారం అందించామని, ఆంక్షలున్నప్పటికీ రష్యాతో మెరుగైన ద్వైపాక్షిక సంబంధాలను తాము కోరుకుంటున్నామని అమెరికా విదేశాంగ ప్రతినిధి వివరించారు. రష్యాపై అమెరికా ప్రకటించిన తాజా ఆంక్షలకు బ్రిటన్‌ సహజంగానే వంతపాడింది. భవిష్యత్తులో తాము జీవ, రసాయన ఆయుధాలను ప్రయోగించ బోమని, ఆయా తయారీ స్థావరాలను ఐరాస పరిశీలనకు అంగీకరిస్తామని రష్యా ప్రకటించే వరకూ ఈ ఆంక్షలు అమలులో వుంటాయని న్యూయర్ట్‌ వివరించారు. రష్యాతో దౌత్య సంబంధాల స్థాయి తగ్గించుకోవటంతో పాటు రష్యా విమానాలపై నిషేధం, రష్యాకు ఎగుమతి, దిగుమతులపై కోతల వంటి అంశాలు ఈ ఆంక్షలలో వున్నాయి.