అమెరికా సైన్యం చేతుల్లోకి జీవాయుధాలు?

అమెరికా సైన్యం చేతుల్లోకి జీవాయుధాలు?

  వాషింగ్టన్‌: అమెరికా సైన్యానికి చెందిన శాస్త్ర పరిశోధనా విభాగం ఇప్పుడు జీవాయుధాలను అభివృద్ధి చేసే పనిలో నిమగమైందని ఐరోపా దేశాలకు చెందిన కొందరు పరిశోధకులు వెల్లడించారు. సైన్స్‌ జర్నల్‌ తాజా సంచికలో 'ఇన్‌సెక్ట్‌ అలైస్‌' (క్రిమి మిత్రులు) పేరుతో ప్రచురించిన వ్యాసంలో వారు ఈ విషయాన్ని వెల్లడించారు. జర్మనీకి చెందిన మాక్స్‌ ప్లాంక్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ ఎవల్యూషనరీ బయాలజీ, యూనివర్శిటీ ఆఫ్‌ ఫ్రీబర్గ్‌తో పాటు ఫ్రాన్స్‌లోని మాంట్‌ పిలీర్‌ యూనివర్శిటీకి చెందిన పరిశోధకులు ఈ జీవాయుధ అభివృద్ధి కార్యక్రమ వివరాలను తమ వ్యాసంలో వివరించారు. అమెరికా తన వ్యవసాయ రంగాన్ని, జాతీయ అత్యవసర పరిస్థితుల్లో వినియోగించేందుకు పరిమిత స్థాయిలో జీవాయుధ తయారీకి సంబంధించిన పరిజ్ఞానాన్ని చేపట్టిందని, దీని ద్వారా శత్రుదేశాలపైకి ఉపయోగించేందుకు జీవాయుధాలు తయారు చేసే ప్రమాదం లేకపోలేదని వారు హెచ్చరించారు. 

ఇదే జరిగితే ప్రపంచ దేశాల మధ్య కుదిరిన బయొలాజికల్‌ వెపన్స్‌ కన్వెన్షన్‌కు తీవ్ర విఘాతం ఏర్పడుతుందని వారు ఆందోళన వ్యక్తం చేశారు. అయితే ఈ అభిప్రాయాన్ని కొట్టిపారేసిన ఇన్‌సెక్ట్‌ అలైస్‌ ప్రోగ్రామ్‌ మేనేజర్‌ డా.బ్లేక్‌ బెక్స్‌టైన్‌ మీడియాతో మాట్లాడుతూ తమ పరిశోధనలు జీవాయుధ తయారీకి సంబంధించినవి కావని, ఇటువంటి లక్ష్యాలతో ఈ పరిశోధనలు కొనసాగితే తాము వాటిని నిర్ద్వంద్వంగా తిరస్కరిస్తామని చెప్పారు. ఇందుకు సంబంధించిన సాంకేతిక పరిజ్ఞానాన్ని తాము ఇప్పటికే సంపాదించామని ఆయన అంగీకరించారు. అయితే బెక్స్‌టైన్‌ వివరణను విడుదల చేసిన డిఫెన్స్‌ అడ్వాన్స్‌డ్‌ రిసెర్చ్‌ ప్రాజెక్ట్స్‌ ఏజెన్సీ (డార్పా) జీవాయుధ తయారీ ఆరోపణలను ఖండించకపోవటం గమనార్హం. ఆహారోత్పత్తులకు సంబంధించిన ముప్పు ఏర్పడినపుడు సత్వరమే స్పందించటానికి వీలుగా ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నామని, ఇది పూర్తిగా ప్రభుత్వ నియంత్రణ, పారదర్శకమైన మార్గదర్శక సూత్రాలకు అనుగుణంగా కొనసాగుతోందని బెక్స్‌టైన్‌ చెబుతున్నారు. ఈ పరిశోధనల్లో తప్పు జరిగే అవకాశాన్ని కొట్టిపారేయలేమని బెక్స్‌టైన్‌ చెప్పారు.