అమెరికాలో పిఎల్‌ఓ కార్యాలయం మూసివేత!

అమెరికాలో పిఎల్‌ఓ కార్యాలయం మూసివేత!

  వాషింగ్టన్‌ : పాలస్తీనా మిషన్‌కు ముగింపు పలకాలని అమెరికా ప్రభుత్వం భావిస్తున్నట్లు తెలుస్తోంది. వాషింగ్టన్‌లోని పాలస్తీనా లిబరేషన్‌ ఆర్గనైజేషన్‌ (పిఎల్‌ఓ) కార్యాలయాన్ని మూసివేయాలని డోనాల్డ్‌ ట్రంప్‌ ప్రభుత్వం నిర్ణయం తీసుకుందని, ఈ విషయాన్ని త్వరలోనే అధికారి కంగా ప్రకటించే అవకాశం ఉందని అమెరికా మీడియాలో ఆదివారం కథననాలు వెలువడ్డాయి. పిఎల్‌ఓ కార్యాలయం మూసి వేత నిర్ణయాన్ని ట్రంప్‌ జాతీయ భద్రతా సలహా దారుడు జాన్‌ బోల్టన్‌ ప్రకటిస్తారని వాల్‌ స్ట్రీట్‌ జర్నల్‌ తన కథనంలో పేర్కొంది. ' ఇజ్రాయిల్‌తో ప్రత్యక్ష, అర్థ వంతమైన చర్చలు ప్రారంభించడానికి పాలస్తీనీయులు తిర స్కరిస్తే పాలస్తీనా లిబరేషన్‌ ఆర్గనైజేషన్‌ను ట్రంప్‌ ప్రభు త్వం అనుమతించదు' అని వాల్‌ స్ట్రీట్‌ పత్రిక తెలిపింది.

అలాగే గాజాలో ఇజ్రాయిల్‌ దాడులపై విచారణపై దృష్టి పెట్టిన అంతర్జాతీయ క్రిమినల్‌ కోర్టు (ఐసిసి)పై కూడా ట్రంప్‌ ప్రభుత్వం చర్యలు తీసుకునే అవకాశాలు ఉన్నాయని పత్రిక తెలిపింది. ఐసిసిలో అమెరికా న్యాయ మూర్తులు ప్రవేశించకుండా నిషేధం విధించడం, అమెరికా ఆర్థిక సంస్థలు ఐసిసికి నిధులు అందచేయకుండా నిషేధం విధించడం.. వంటి చర్యలను ట్రంప్‌ ప్రభుత్వం తీసుకోనుందని పత్రిక తెలిపింది.

అలాగే జెరూసెలంలో ఆసుపత్రి కోసం కేటాయించిన సుమారు 25 మిలియన్ల డాలర్ల నిధులను కూడా ట్రంప్‌ ప్రభుత్వం వెనక్కి తీసుకుందని అమెరికా మీడియా తెలిపింది. ఈ నిధులను ఇతర కార్యక్రమాలకు మళ్లిస్తారని వెల్లడించింది. ట్రంప్‌ ప్రభుత్వం తదుపరి నిర్ణయం పాలస్తీనాకు నిధుల కోత విధించడమేనని అమెరికా మీడియా పేర్కొంది.కాగా, పాలస్తీనాకు వ్యతిరేకంగా నిర్ణయాలు తీసుకోవడం ట్రంప్‌ ప్రభుత్వానికి కొత్త కాదు. గత ఏడాది డిసెంబరులో అమెరికా రాయబార కార్యాల యాన్ని ఇజ్రా యిల్‌ నుంచి జెరూసెలంకు తరలిస్తున్నట్లు ప్రకటించింది. ఇజ్రాయిల్‌ రాజధానిగా జెరూసెలంను గుర్తిస్తున్నట్లు ప్రకటించింది. 2017లో కూడా పిఎల్‌ఓ కార్యాలయాన్ని మూసివేస్తామని ట్రంప్‌ ప్రభుత్వం హెచ్చరించింది. ఈ కార్యాలయం కొనసాగాలంటే ఇజ్రాయిల్‌-పాలస్తీనా మధ్య అర్థవంతమైన సంబం ధాలు ఉండాలని అమెరికా చట్టాలు పేర్కొన్నాయని తెలిపింది. దీని తరవాత పిఎల్‌ఓకు అనుమతి ఇచ్చింది. ప్రస్తుతం అమెరికా-పాలస్తీనా మధ్య సంబంధాలు కొనసాగుతున్నాయి.