బహుళవాదాన్ని బలోపేతం చేద్దాం..!

బహుళవాదాన్ని బలోపేతం చేద్దాం..!

  బ్యూనస్‌ఎయిర్స్‌ : బహుళవాదాన్ని బలోపేతం చేయడానికి రష్యా,భారత్‌,చైనా అంగీకరించాయి. ఐక్యరాజ్యసమితి(యూఎన్‌),ప్రపంచ వాణిజ్య సంస్థ(డబ్ల్యూటీవో)సహా బహుళ సంస్థలన్నిటినీ సంస్కరించి బలోపేతం చేయాలని పిలుపునిచ్చాయి. ప్రపంచ స్థిరత్వానికి బాసటగా నిలవాలని ఇతర దేశాలకు సూచించాయి. అర్జెంటీనాలో జరుగుతున్న జీ-20 సదస్సు సందర్భంగా రష్యా అధ్యక్షుడు పుతిన్‌, చైనా అధ్యక్షుడు జిన్‌పింగ్‌లతో ప్రధాని మోడీ ప్రత్యేకంగా భేటీ కావడం ప్రాధాన్యత సంతరించుకున్నది. ఆర్‌ఐసీగా ప్రసిద్ధి చెందిన ఈ మూడు దేశాలు 12 ఏండ్ల క్రితం తొలిసారి సమావేశమయ్యాయి. ఇది రెండో దఫా భేటీ అన్నది గమనార్హం. 

అంతర్జాతీయ వేదికల్లో పరస్పర సహకారంతో వ్యవహరించేందుకు ముగ్గురు నేతలు సుముఖత వ్యక్తం చేశారు. అంతర్జాతీయంగానూ, ప్రాంతీయంగానూ శాంతి, సుస్థిరత కోసం ఎప్పటికపుడు సంప్రదింపులు కొనసాగించాలని ముగ్గురు నేతలు నిర్ణయించారు. ప్రపంచం ఎదుర్కొంటున్న సవాళ్లను(ఉగ్రవాదం, వాతావరణంలో మార్పులు, వగైరా), దేశాల మధ్య అన్ని రకాల విభేదాలను తీర్మానాలు, శాంతియుత చర్చల ద్వారా పరిష్కరించుకోవడాన్ని ప్రోత్సహించాలని ముగ్గురు నేతలు నిర్ణయించారు. అంతర్జాతీయ సంస్థల కార్యక్రమాల సందర్భంగా ఆర్‌ఐసీ ప్రత్యేక భేటీలు కొనసాగించాలని నిర్ణయించారు. ఈ మూడు దేశాల భేటీకి చొరవ చూపిన పుతిన్‌కు ప్రధాని మోడీ కృతజ్ఞతలు తెలిపారు.

ఉగ్రవాదాన్ని అరికట్టడంలోనూ, విపత్తులను ఎదుర్కొనేందుకు మానవతా సాయం అందిండంలోనూ కలిసి పని చేయాలని అగ్రనేతలు నిర్ణయించారు. అగ్రనేతల మధ్య సమావేశం సుహృద్భావ వాతావరణంలో సాగిందని భారత విదేశాంగ కార్యదర్శి విజరుగోఖలే మీడియాకు తెలిపారుభారత్‌, చైనా మధ్య సంబంధాలు మెరుగుపడటానికి ఇది ఓ సూచికగా భావిస్తున్నారు. మరోవైపు చైనా, అమెరికా మధ్య పరస్పర వాణిజ్య ఆంక్షల నేపథ్యంలో ఈ మూడు దేశాల సమావేశాన్ని దౌత్య నిపుణులు ఆసక్తిగా గమనించారు. ఆర్‌ఐసీకి చెందిన విదేశాంగమంత్రులు ప్రతిఏటా భేటీ కావడం ఆనవాయితీగా వస్తోంది.