బంధం మరింత బలోపేతం

బంధం మరింత బలోపేతం

  రష్యా: రష్యా, చైనా మధ్య ద్వైపాక్షిక సంబంధాలను మరింత బలోపేతం గావించాలని చైనా, రష్యా నిర్ణయించాయి. రష్యాలోని తూర్పు రేవు నగరం వ్లాదివోస్తోక్‌లో జరుగుతున్న తూర్పు ఆర్థిక వేదిక (ఇఇఎఫ్‌ ) సమావేశాల్లో పాల్గొనేందుకు తొలిసారి ఆ ప్రాంతాన్ని సందర్శించిన జిన్‌ పింగ్‌, రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్‌ పుతిన్‌తో బుధవారం విడిగా సమావేశమయ్యారు. ద్వైపాక్షిక సంబంధాలను మరింత మెరుగుపరచుకోవాలని, ప్రపంచ శాంతి, సుస్థిరతను పరిరక్షించాలని ఇరువురు నేతలు నిర్ణయించారు. చైనా బెల్ట్‌ అండ్‌ రోడ్డు చొరవ, యూరేసియన్‌ ఎకనిమిక యూనియన్‌, ఇంధనం, వ్యవసాయం, హైటెక్‌, ఫైనాన్స్‌ రంగాల్లో ఇరు దేశాలు పరస్పరం సహకరించుకోవాలని నిర్ణయించాయి. 

రష్యా, చైనా మధ్య వాణిజ్యం 2017లో 8,700 కోట్ల డాలర్లకు చేరింది. ఈ ఏడాది ఇది పది వేల కోట్ల డాలర్లకు చేరుకోనుందని పుతిన్‌ చెప్పారు. రాజకీయ, భద్రత, రక్షణ రంగాల్లో ఇరు దేశాలు విశ్వాసాన్ని పెంపొందించేలా సహకరించుకుంటాయన్నారు. ఏకపక్షవాదం, రక్షణాత్మక చర్యలు (ప్రొటెక్షనిజం)కు తాము వ్యతిరేకమని ఇరువురు నేతలు చెప్పారు. తూర్పు ఆర్థిక వేదిక సమావేశానికి 60 దేశాల నుంచి 7,000 మంది ప్రతినిధులు హాజరయ్యారు. సీ జిన్‌ పింగ్‌ రష్యా పర్యటన నేపథ్యంలో రష్యాలోని చైనా రాయబారి లీ హుయి పీపుల్స్‌ డైలీ పత్రికకు ఒక వ్యాసం రాస్తూ, చైనా-రష్యా సంబంధాలు ఇదివరకెన్నడూ లేనంత ఉన్నత స్థితికి చేరాయన్నారు. ఇరు దేశాల మధ్య సహకార బంధం మరింత పటిష్టపడడానికి జిన్‌ పింగ్‌ పర్యటన దోహదపడుతుందని రష్యన్‌ ఉన్నతాధికారులు పలువురు భావిస్తున్నారు.