బీఎండబ్ల్యూలో తండ్రి శవాన్ని ఉంచి.. 

బీఎండబ్ల్యూలో తండ్రి శవాన్ని ఉంచి.. 

  లాగోస్‌ : ఎవరైనా మరణిస్తే వారి ఆచార వ్యవహారాలకు అనుగుణంగా భౌతికకాయాన్ని పాతిపెట్టడమో, దహన సంస్కారాలు నిర్వహించడమో చేస్తారు. కానీ నైజీరియాకు చెందిన అజుబుకి అనే వ్యక్తి తన తండ్రి శవాన్ని ఏకంగా బ్రాండ్‌ న్యూ బీఎండబ్ల్యూ కారులో ఉంచి సమాధి చేశారు. నైజీరియాలోని మారుమూల గ్రామం ఎంబొసిలో చోటుచేసుకున్న ఈ ఘటనకు సంబంధించిన ఫోటో గత రెండు రోజులుగా సోషల్‌ మీడియాలో ట్రెండింగ్‌ అవుతోంది. బీఎండబ్ల్యూ కారులో ఉంచిన మృతదేహాన్ని సమాధి చేసేందుకు ఆరు అడుగుల లోతున గుంటను తవ్వారు.

తాను ఎప్పటికైనా ఖరీదైన కారును కొంటానని అజుబుకి తరచూ తన తండ్రితో చెప్పేవారు. తండ్రి మరణంతో వెనువెంటనే బీఎండబ్ల్యూ కారును కొన్న అజుబుకి మృతదేహాన్ని కారులో ఉంచి సమాధి చేయడం చూపరులకు విస్తుగొలుపుతోంది. మరోవైపు తన తండ్రిని స్వర్గానికి తీసుకువెళ్లేందుకు సహకరించేలా కారులో శాటిలైట్‌ నావిగేషన్‌ను ఏర్పాటు చేసినట్టు ది సన్‌ పత్రిక పేర్కంది.

మొత్తానికి అజుబుకి నిర్ణయం ఇంటర్‌నెట్‌ను ఊపేస్తోం‍ది. దీనిపై నెటిజన్లు పలురకాలుగా స్పందిస్తున్నారు. తండ్రిపై అజుబకి ప్రేమను కొందరు సమర్ధిస్తుండగా, దీనికి ఖర్చు చేసిన మొత్తం పేదలకు సాయపడేందుకు ఉపయోగిస్తే బావుండేదని మరికొందరు వ్యాఖ్యానించారు.